ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారా? అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయ్యారా? మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికల ప్రచారానికి సైతం సై అంటున్నారా?
ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ ఎక్కడా ప్రకటించలేదు. కానీ తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థిని ప్రకటించారు. అందుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నౌపడ బహిరంగ సభను సీఎం వైఎస్ జగన్ వేదికగా మార్చుకున్నారు. టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ బరిలో ఉంటారని ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు అండగా ఉండాలని.. గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ సాగునీటి కోసం రూ.70కోట్లతో చేపట్టాల్సిన పనులకు సీఎం జగన్ గ్రాంట్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని తేల్చి చెప్పేశారు. కన్ఫ్యూజన్ ఉంటే నష్టపోతామని ఇక అలాటి పరిస్థితి ఉండకూడదని తేల్చి చెప్పేశారు.దువ్వాడ శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ అని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ అచ్చెన్నాయుడుగా టెక్కలి ఎన్నికలు జరగనున్నాయి.