నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 55 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో). ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 11.49 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 55 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో). దీని ద్వారా రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో . సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువున్న టెలియోస్ 2, 16 కిలోల బరువున్న లూమ్ లైట్ 4 శాటిలైట్లను పీఎస్ఎల్వీ సీ 55 నింగిలోకి మోసుకెళ్లింది. సింగపూర్ భూ పరిశీలనకు టెలియోస్ 2 శాటిలైట్ ఉపయోగపడనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 11.49 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొత్తం 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్ సాగింది.
అంతకుముందు పీఎస్ఎల్వీ సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని స్థానిక గ్రామదేవత చెంగాలమ్మ ఆలయంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జిఎస్ఎల్వి మాక్-2, ఆదిత్య ఎల్-1, చంద్రయాన్-3 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా వెల్లడించారు. మరోవైపు.. పీఎస్‌ఎల్వీ సీ 55 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించడంతో పాటు , షార్‌కు సమీపంలో వున్న తీర ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇకపోతే.. ఈ ఏడాది చివరి నాటికి.. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రాథమిక మిషన్‌లను ఇస్రో ప్రారంభించనున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఫిబ్రవరిలో తెలిపారు. దాని తదుపరి దశలో.. ఇస్రో తన మొట్టమొదటి మానవ అంతరిక్ష-విమాన మిషన్ 2024లో ప్రారంభించబడుతుందనీ, స్వయం సమృద్ధి గల భారతదేశానికి గగన్‌యాన్ మిషన్ ఉత్తమ ఉదాహరణ అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష యాత్ర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. గగన్‌యాన్ మిషన్‌ను రూ.10,000 కోట్లతో 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.