24 ఏప్రిల్ 2023
సచిన్ టెండూల్కర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈరోజు సచిన్ 50వ పుట్టినరోజు.
మూడున్నర దశాబ్దాలుగా సచిన్‌కు క్రికెట్‌తో అనుబంధం ఉంది. క్రికెట్‌తో సచిన్ ప్రయాణాన్ని కొంతమంది చాలా దగ్గరగా చూడగలిగారు.
సచిన్‌ను తరచి చూసిన కొందరిలో ద్వారకానాథ్ సంజగిరి ఒకరు. ఆయన క్రికెట్ విమర్శకుడు, రచయిత. క్రికెట్ పిచ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కెరీర్, పరుగులు, రికార్డులు గురించి ఆయన విస్తృతంగా రాశారు.
కానీ, మైదానం బయట సచిన్ ఎలా ఉంటారనే అంశం గురించి త్వరలో రాబోయే తన పుస్తకం ‘‘సచకత్ ఇచ్ఛా… సచిన్’’లో ద్వారకానాథ్ రాశారు. సచిన్ పాపులారిటీని చూపించే కొన్ని ఘటనల గురించి ద్వారకానాథ్ ఈ పుస్తకంలో వివరించారు. ఆ పుస్తకం నుంచి సేకరించిన కొన్ని సంఘటనలు ఇక్కడ చూద్దాం.
సచిన్ పేరు మారుమోత
భారత క్రికెట్‌లోని చాలామంది ప్రముఖ క్రికెటర్లు ఇప్పుడు లేరు. మా నాన్న తరంలో సీకే నాయుడు, ముస్తాక్ అలీ చాలా పాపులర్.
కానీ, సచిన్ టెండూల్కర్ పాపులారిటీ అన్ని హద్దులను చెరిపేసింది. సచిన్ తర్వాత ధోనిని కూడా క్రికెట్ అభిమానులు ఆదరించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నారు.
అయితే, నా జీవితంలో సచిన్ అంత పాపులర్ క్రికెటర్ మరొకరిని నేను చూడలేదు. ఆయన పాపులారిటీ మరో స్థాయిలో ఉంటుంది. ఆయనకు ప్రజాదరణ ఎప్పుడూ తగ్గలేదు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా అదే ఆదరణ.
ఈ మధ్య కాలంలో ట్విట్టర్‌లో సచిన్ ఒక పోస్ట్ చేశాడు. సచిన్ ఒక విమానంలోకి అడుగుపెట్టగానే అందులో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆనందంతో ‘‘సచిన్… సచిన్’’ అంటూ అరవడం మొదలుపెట్టారు.
అయితే, తన సీటులో కూర్చున్న సచిన్, నిలబడి అక్కడున్న అందరికీ అభివాదం చేయలేకపోయాడు. తర్వాత ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, ‘‘అందరికీ ధన్యవాదాలు. మీరు నన్ను పిలుస్తున్నప్పుడు విమానంలో ‘సీట్‌బెల్ట్ సైన్ ఇండికేషన్’ రావడంతో లేచి నిలబడి అందరినీ పలకరించలేకపోయాను’’ అంటూ పేర్కొన్నాడు. విమాన నిబంధనలు పాటిస్తూ అభిమానులు కృతజ్ఞతలు తెలిపాడు.
2010లో సచిన్ 87 ఏళ్ల సరస్వతి వైద్యనాథన్ అనే మహిళను కలిశారు. ఆమె సచిన్‌ను తన సొంత మనవడిగా పరిగణిస్తారు. సచిన్ పరుగులు, రికార్డులు తదితర వివరాలన్నింటినీ ఆమె బాగా గుర్తు పెట్టుకున్నారు.
ఆమె కుమారుడు మాట్లాడుతూ, ‘‘సచిన్ ఆటను చూస్తూ ఆమె తన అనారోగ్యం గురించి మర్చిపోతారు. నిజానికి సచిన్ ఆట చూశాక ఆమె కుదుటపడతారు. సచిన్ సెంచరీ చేస్తే చూడాలని అనుకున్నారు. కానీ, ఆయన సెంచరీ చేసిన సమయంలో ఆమె ఈ లోకంలో లేరు’’ అని చెప్పారు.
సచిన్ పక్కన కూర్చునేందుకు అమితాబ్ ఏం చేశారంటే…
వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సచిన్ అభిమానులే.
ఒకసారి సచిన్ టెండూల్కర్, ఎయిర్‌పోర్ట్‌లో నడుస్తుండగా వెనకనుంచి ‘‘హే సచిన్ తెందూల్కర్, నేను బీమ్‌సేన్ జోషి. మీకు పెద్ద అభిమానిని’’ అంటూ ఒక అరుపు వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగిన సచిన్ వెళ్లి భీమ్‌సేన్ జోషిని కలిశారు.
నేను సునీల్ గావస్కర్, గుండప్ప విశ్వనాథ్ కోసం ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేశాను. ఆ కార్యక్రమంలో సునీల్ గావస్కర్, విశ్వనాథ్‌లను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సత్కరించాల్సి ఉంది. అదే కార్యక్రమానికి సచిన్‌ను అతిథిగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం గురించి అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడటానికి మేం మెహబూబ్ స్టూడియోకు వెళ్లాం. ఏ సమయానికి కార్యక్రమం మొదలు అవుతుంది? అని ఆయన మమ్మల్ని అడిగారు. సాయంత్రం 4 నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పాం.
‘‘నేను మూడు గంటలకల్లా కార్యక్రమానికి వస్తే మీకు ఓకేనా? అని ఆయన చాలా మర్యాదగా అడిగారు. అమితాబ్ బచ్చన్ త్వరగా వస్తానంటే ఎవరు కాదంటారు? మీరు ఒక రోజు ముందుగా వచ్చినా మాకు సంతోషమే అని నేను నా మనసులో అనుకున్నా.
అప్పుడు ఆయన మళ్లీ మాట్లాడుతూ, ‘‘నేను త్వరగా ఎందుకు రావాలి అనుకుంటున్నానంటే, నేను అప్పుడప్పుడు క్రికెటర్లందరినీ కలుస్తుంటా. కానీ, వారి కుటుంబీకులను, తోడబుట్టినవారిని తరచుగా కలవలేను. సునీల్ గావస్కర్ తల్లిదండ్రులతో పాటు, సచిన్ తల్లిని, అన్నను నేను కలవాలి అనుకుంటున్నా’’ అని చెప్పారు.
ఆ కార్యక్రమానికి సచిన్ తల్లి రాలేదు. కానీ, అనుకున్నట్లే సచిన్ అన్నతో అమితాబ్ మాట్లాడారు. అంతకు కొన్ని రోజుల ముందు ఒక సరదా ఘటన జరిగింది. కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అమితాబ్ పీఏ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఆయన మమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేశారు. ‘‘అమితాబ్ సర్, సచిన్ తెందూల్కర్ పక్కన కూర్చోవచ్చా?’’ అంటూ ఫోన్‌లో అడిగారు. ఆ మాట వినగానే నేను ఆశ్చర్యపోయాను. ఈ విషయం సచిన్‌కు చెప్పినప్పుడు ఆయన ఎలాంటి అనుభూతి చెందారో నేను చెప్పలేను.
‘‘హ్యారీ పాటర్’’ కూడా సచిన్ అభిమానే
‘‘హ్యారీ పాటర్’’ హీరో డేనియల్ రాడ్‌క్లిఫ్, సచిన్‌కు వీరాభిమాని.
ఇంగ్లండ్ తరఫున ఆడాలని ఆయన ఒకప్పుడు అనుకున్నారు. కానీ, ఆయన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోలేకపోయారు. హ్యారీ పాటర్ సినిమాతో ఆయన చాలా పాపులర్ అయ్యారు.
2007లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆట ఆఖరు రోజు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పుడు రాడ్‌క్లిఫ్‌తో పాటు ఆయన స్నేహితులు అక్కడే ఉన్నారు. మ్యాచ్ ముగిశాక ఇంగ్లండ్ జట్టుతో పాటు వారు సచిన్‌ను కలిశారు.
లండన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నేను, నా స్నేహితులు సచిన్‌ను కలిశాం. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోగలిగాం. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన నిజంగా లెజెండ్’’ అని అన్నారు.
ఇలా సెలెబ్రిటీలు, సచిన్ వెంట పడిన అనేక ఉదంతాల గురించి నేను మీకు చెప్పగలను.
అణుకువైన క్రికెటర్
సచిన్‌కు పద్నాలుగేళ్ల వయస్సున్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. ఇప్పుడు ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ 36 ఏళ్లలో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. కానీ, ఎప్పుడూ ఒదిగే ఉన్నాడు.
కనివినీ ఎరుగనంత పాపులారిటీని దక్కించుకున్న తర్వాత కూడా దాన్ని తలకు ఎక్కించుకోకుండా అణుకువగా ఉండటం అంత సులభం కాదు. కాస్త పేరు రాగానే మారిపోయిన చాలా మంది క్రికెటర్లను నేను చూశాను. కానీ, సచిన్ ఎప్పుడూ మారలేదు.
1999లో జరిగిన ఒక ఘటన గురించి ఇక్కడ చెప్పాలి.
ప్రపంచకప్‌కు ముందు సచిన్, ఆయన భార్య అంజలి, కూతురు సారా మా ఇంటికి డిన్నర్ చేయడం కోసం వచ్చారు.
సచిన్ ఇక్కడికి వస్తుంటారని చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. అందుకే ఆయన వచ్చినప్పుడల్లా మా ఇంటి ముందు జనాలు గుమిగూడతారు. వారందరినీ సచిన్ ఆప్యాయంగా పలకరిస్తారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు.
కానీ, ఈసారి సచిన్‌తో పాటు రాహుల్ ద్రవిడ్ ఇంకా మరో క్రికెటర్ వస్తున్నారనే పుకారు చెలరేగడంతో భారీగా జనాలు పోగయ్యారు.
కొంతమంది సచిన్ మెర్సిడెస్ కారు పైకి ఎక్కి మా ఇంట్లోకి తొంగి చూడటం మొదలుపెట్టారు.
వారిని అదుపు చేయడానికి పోలీసును పిలిపించాం. లాఠీతో వచ్చిన ఆ పోలీస్.. సచిన్ ఎక్కడ? సచిన్ ఎక్కడ? అంటూ ఆనందంతో మా ఇంట్లోకి పరుగెత్తుకొచ్చారు. ముందు సచిన్‌తో మాట్లాడి, షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత జనాలను అదుపు చేసే పని మొదలుపెట్టారు.
‘‘నేను వాళ్లకి ఆటోగ్రాఫ్ ఇవ్వొచ్చా?’’ అంటూ సచిన్ అడిగారు. మీరు ఇప్పుడు సంతకాలు మొదలుపెడితే తెల్లవారుజాము వరకు మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని నేను చెబుతూనే ఉన్నా.. మరోవైపు అప్పటికే సచిన్ 50 సంతకాలు చేసి ఉంటారు.
పాపులారిటీ పరంగా లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్‌లకు సమానంగా సచిన్ పాపులారిటీ ఉంటుంది. కానీ, వారెవ్వరూ ఇలా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి ప్రయత్నించి ఉండదరు. కానీ, సచిన్ మాత్రం చాలా ఆనందంగా ఆ పని చేసేవారు.
ముంబై క్రికెట్ సంఘం మైదానంలో సచిన్ ప్రాక్టీస్ చేస్తుండేవారు. అక్కడ చాలామంది సంపన్నుల వివాహాలు జరుగుతుండేవి. వారంతా సచిన్‌తో ఫొటోలు తీసుకునేవారు. ఒకసారి చిరిగిన దుస్తులతో ఉన్న చిన్న పిల్లవాడు, సచిన్‌తో ఫొటో కోసం ప్రయత్నించాడు. కానీ, అతన్ని పెళ్లి బృందంలోని వారు బయటకు పంపించారు. ఆ బాలుడు పొలం వైపు వెళ్లడాన్ని సచిన్ గమనించాడు.
అక్కడ పొలంలో రాళ్లు పగలగొడుతున్న ఒక వ్యక్తిని సచిన్ చూశాడు. ఆ బాలుడిని అతని కుమారుడిగా భావించాడు. తర్వాత ఆ బాలుడి వద్ద ఉన్న ఫోన్‌లో ఫొటోలు ఉన్నాయా? లేదా అని చూసిన సచిన్, ఆ బాలుని తండ్రితో మాట్లాడుతూ, మీకు ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని ఫొటోలు తీసుకోండి అంటూ ఆ బాలుడితో నిల్చున్నారు.
ఇప్పటికీ సచిన్ నామ స్మరణే
నేను అనారోగ్యంగా ఉన్నానని తెలిసి సచిన్ నాకు ఫోన్ చేశారు. నేను, అజిత్, నితిన్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాం. మీరెక్కడ ఉన్నారని నన్ను అడిగారు. నేను నా కుమారుడు సనీల్‌ను పిలిచాను. సచిన్ రాక గురించి రహస్యంగా ఉంచాం.
సచిన్ రాగానే సనీల్ తనను లోపలికి తీసుకురావడానికి వెళ్లాడు. ఎవరూ వారిని గమనించలేదు. కానీ, అక్కడ పనిచేసే ఒక మహిళ సచిన్‌ను చూసి ఎవరతను? అని గుర్ఖాను అడిగారు. ఆ మాట సచిన్ కూడా విన్నారు. గుర్ఖా చెప్పడంతో ఆమె సచిన్‌ను గుర్తు పట్టారు.
తర్వాత రెండు గంటల పాటు ఆయన మా ఇంట్లో ఉన్నారు. మా ఇంట్లో పనివారితో కూడా సచిన్ మర్యాదగా నడుచుకున్నారు. వారికి ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
కానీ, కింద ఏం జరుగుతుందో మేం గమనించలేదు. సచిన్ వచ్చాడనే వార్త దావానలంలా పాకింది. దాదాపు 500 మంది ప్రజలు అక్కడ గుమిగూడారు. అందరూ పెన్‌లు, నోట్‌బుక్‌లతో నిల్చున్నారు.
‘‘మీ కారును బేస్‌మెంట్‌కు పిలుద్దాం. అక్కడినుంచి ఎలివేటర్ ద్వారా మీరు హాయిగా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు’’ అని నేను సచిన్‌కు చెప్పాను. కానీ, ఆయన నో అన్నారు.
‘‘తప్పించుకొని వెళ్లి వీళ్లందరినీ బాధ పెట్టలేను’’ అని సచిన్ అన్నారు.
సచిన్ పాపులారిటీ అనేది వాడిపోని పరిమళం లాంటిదని నేను గ్రహించాను.