పరీక్ష రాసినవారు ఇంట్లో ఉంటే ఆ బాధ తెలుస్తుంది
పరీక్షల రద్దు సరైందే.. అనర్హులను అడ్డుకున్నట్లైంది
న్యాయమూర్తి విజయ్‌సేన్ రెడ్డి వ్యాఖ్యలు
సిట్‌పై రాజకీయ ఒత్తిడి.. కేసు సీబీఐకి ఇవ్వండి
హైదరాబాద్, ఏప్రిల్ 24 టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ భవిష్యత్తును ఈనెల 28న నిర్ణయిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తు సిట్ వల్ల కాదని, ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుందని, సీబీఐకి కేసును అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పైజస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా వాదనలు వినిపించారు. సిట్‌కు పేపర్‌లీకేజీ కేసు దర్యాప్తు చేపట్టేంత నైపుణ్యం లేదని ఆయన కోర్టుకు వివరించారు. ‘‘సిట్‌పై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఉంది. మంత్రి కేటీఆర్ ఈ కేసులో ఇద్దరు తప్ప ఇంకెవరూ లేరని అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చేశారు. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ప్రకటన తర్వాత సిట్ అంతకుమించి దర్యాప్తు చేయలేదు. అసలు సిట్‌లో సాంకేతిక అంశాలపై అవగాహన, నైపుణ్యం ఉన్న అధికారులు ఎవరూ లేరు. కంప్యూటర్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే వాదన ఉంది. దానిపై సిట్‌కు అసలు అవగాహన లేదు. ఇందులో అంతర్జాతీయ లావాదేవీలు, మనీలాండరింగ్ సైతం జరిగింది. టీఎ్‌సపీఎస్సీకి సంబంధించిన మొత్తం సర్వర్ హ్యాకింగ్‌కు గురైనట్లు ఆరోపణలున్నాయి. 15 పరీక్షలను టీఎ్‌సపీఎస్సీ రద్దు చేసిందంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి’’ అని వివేక్ తంఖా పేర్కొన్నారు.
టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ను ఆయన కార్యాలయానికి వెళ్లి సిట్ అధికారులు విచారించారని.. పెద్ద వ్యక్తులకు నోటీసులు ఇచ్చి సిట్ కార్యాలయానికి రమ్మనే దమ్ము దర్యాప్తు సంస్థకు లేదని విమర్శించారు. ఈ కేసుతో పెద్ద వ్యక్తులకు సంబంధాలున్నాయని తెలిసినా.. సిట్ వారి జోలికి వెళ్లే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కేసు సిట్ చేతికి వచ్చి దాదాపు నెలన్నర కావొస్తున్నా.. సాంకేతిక, ఫోరెన్సిక్ అంశాలపై ఎటువంటి దర్యాప్తు చేయలేదని విమర్శించారు. పేపర్ లీకేజీ మాట్లాడిన ప్రతిపక్ష నాయకులకు సిట్ నోటీసులు ఇచ్చిందని.. మరి మంత్రి కేటీఆర్‌ను ఎందుకు విచారణకు పిలవలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయ లావాదేవీలు, టెక్నికల్ అంశాలు ఉన్నందున సీబీఐ మాత్రమే ఈ కేసును దర్యాప్తు చేయగలదని పేర్కొన్నారు. ‘వ్యాపం’ వంటి సాంకేతిక అంశాలతో కూడిన కేసులు, పేపర్ లీకేజీ కేసులు ఎక్కువగా సీబీఐ దర్యాప్తు చేసిందని గుర్తుచేశారు. ఇది 30 లక్షల మందికి సంబంధించిన వ్యవహారమని.. కేసు ప్రభావాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సిట్ దర్యాప్తు సరైన డైరెక్షన్‌లో, సమర్థంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు 40 మంది సాక్షులను సిట్ విచారించిందని.. 20 మందిని నిందితులుగా చేర్చిందని గుర్తుచేశారు. కేవలం ఒక్క నిందితుడు న్యూజిలాండ్‌లో ఉన్నాడని తెలిపారు. 12 కంప్యూటర్‌లను సీజ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు.
ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉందని.. దర్యాప్తు కీలక దశలో ఉన్న సందర్భంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. పేపర్ లీకేజీ తీవ్రమైన అంశమని, మన ఇంట్లో పరీక్షలు రాసిన వారు ఉంటే ఆ బాధ ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. పరీక్షలు రద్దు చేయడం వల్ల ఒకరకంగా అనర్హులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నట్లయిందని వ్యాఖ్యానించింది. అయితే సిట్‌లో నిపుణులు లేరనేది తీవ్రమైన ఆరోపణ అని వ్యాఖ్యానించింది. సాంకేతిక అంశాల విశ్లేషణకు మళ్లీ ఔటర్‌సోర్సింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా?అని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ప్రతిపక్ష నేతలను ఎందుకు విచారణకు పిలిచారని.. వారి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? అని ప్రశ్నించింది. కేసును స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలా? సిట్‌తో దర్యాప్తు చేయించాలా? సిట్ విషయంలో ఏమైనా మార్పులు చేయాలా? అన్న అంశాలపై ఈ నెల 28న ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది