NRI-NRT

ట్రంప్ నాపై అత్యాచారం చేశారు.. కోర్టుకెక్కిన 79 ఏళ్ల రచయిత్రి

ట్రంప్ నాపై అత్యాచారం చేశారు.. కోర్టుకెక్కిన 79 ఏళ్ల రచయిత్రి

30 ఏళ్ల క్రితం ట్రంప్ తనపై అత్యాచారం చేశారన్న జీన్ కరోల్

‘ట్రూత్’ ద్వారా ట్రంప్ తన పరువును తీశారని కరోల్ ఆవేదన

రాజకీయ ప్రేరేపితమన్న ట్రంప్

ఈ కేసు గురించి మాట్లాడడం ఆపకుంటే చర్యలు తప్పవని ట్రంప్‌కు న్యాయమూర్తి హెచ్చరిక

వాషింగ్టన్ : దాదాపు 30 సంవత్సరాల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ మహిళా రచయిత ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. తనపై అత్యాచారానికి పాల్పడిన ట్రంప్ ఆ తర్వాత ఎలా అబద్ధం చెప్పింది విచారణలో వివరించారు. ట్రంప్ నాడు తనపై అత్యాచారం చేయడం వల్లే తానీరోజు ఇక్కడ నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దీని గురించి అప్పట్లో రాసుకొచ్చానని, అయితే ట్రంప్ అలాంటిదేమీ జరగలేదని అబద్ధం చెప్పారని మన్‌హటన్ ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో రచయిత ఇ జీన్ కరోల్ న్యాయమూర్తులకు వివరించారు. తనపై అత్యాచారానికి పాల్పడిన ట్రంప్ అలాంటిదేమీ జరగలేదని అబద్ధం చెప్పడమే కాకుండా తన పరువు తీశారని, తన జీవితాన్ని తిరిగి వెనక్కి పొందేందుకే ఈ రోజు తానిక్కడ నిలబడాల్సి వచ్చిందని జీన్ కరోల్ పేర్కొన్నారు. 79 ఏళ్ల కరోల్ ఎల్లె మ్యాగజైన్ మాజీ అడ్జైజ్ కాలిమిస్ట్. తనపై జరిగిన లైంగిక దాడికి గాను ట్రంప్ నుంచి పరిహారం కోరారు. అయితే, ఎంతమొత్తం అన్నది తెలియరాలేదు. 76 ఏళ్ల ట్రంప్ వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు.

1995-1996 మొదట్లో బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెసింగ్‌రూములో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు కరోలిన్ తన దావాలో ఆరోపించారు. తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా అదంతా ఉత్తదేనని, బూటకమని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో చెబుతూ ట్రంప్ తన పరువును తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ‘మోసపూరిత చర్య’ అని పేర్కొన్నారు. కాగా, కరోల్ న్యూయార్క్ అడల్ట్ సర్వైవర్స్ చట్టం కింద కూడా దావా వేస్తున్నారు. ఈ చట్టం ద్వారా చాలాకాలం క్రితం జరిగిన నేరాలను కూడా సవాలు చేయొచ్చు. కరోల్ ఆరోపణలపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ ద్వారా నిన్న తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఇది ముందస్తు పథకం ప్రకారం జరుగుతున్న స్కామ్ అని ఆరోపించారు. ఇది పూర్తిగా తప్పుడు కథనమని తేల్చి చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లూయిస్ కప్లాన్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసు గురించి మాట్లాడడం ఆపకపోతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.