సుజీత్ దర్శకత్వంలో పవన్ కొత్త చిత్రం ఓజీ,ఇటీవలే ముంబయిలో షూటింగ్ ప్రారంభం
తాజాగా ప్రకాశ్ రాజ్ పై సన్నివేశాల చిత్రీకరణ,ఈ ఏడాది ఆఖరుకు ఓజీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లో ఓజీ (ఒరిజనల్ గ్యాంగ్ స్టర్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంబయిలో వేగంగా సాగుతోంది. తాజాగా, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయనపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో పవన్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు.
ముంబయి షెడ్యూల్ ముగిసిన అనంతరం పుణేలో మరో షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తోంది. సినిమాలోని ముఖ్యమైన నటులందరూ ఈ షెడ్యూల్ లో షూటింగ్ కు హాజరవుతారని సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఓజీలో పవన్ కల్యాణ్ సరసన తమిళమ్మాయి ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, డిసెంబరు నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఓజీ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.