ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య చర్చల అజెండా ఏంటో నిర్ధిష్టంగా తెలియకపోయినా ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్దితులపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపైనా చర్చించే అవకాశముంది.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల విషయంలో గతంలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెండుసార్లు సమావేశమై ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఓవైపు బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే అంశంపై ఢిల్లీలోనూ బీజేపీ పెద్దల్ని కలిసి చర్చించారు. అయితే ఇప్పటికిప్పుడు టీడీపీతో పొత్తుపై తమ నిర్ణయం చెప్పేందుకు బీజేపీ పెద్దలు ఇష్టపడటం లేదు.
మరోవైపు ఏపీలో మాత్రం గత కొంతకాలంగా టీడీపీ-జనసేన నేతలు క్షేత్రస్ధాయిలో కలిసి పనిచేస్తున్నారు. అధికారికంగా పొత్తు లేకపోయినా ఇరు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. స్ధానిక ఎన్నికల్లో సైతం సర్దుబాట్లు చేసుకుని పలు సీట్లలో గెలుపొందారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కుదిరితే బీజేపీని కూడా కలుపుకుని వీరిద్దరూ పొత్తును విసృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుదరకపోతే మాత్రం బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీతో ముందుకెళ్లేందుకు పవన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
అటు ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్దితుల నేపథ్యంలో అధికార వైసీపీకి దీటుగా టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలోనే పవన్ ప్రకటించారు. ఇందులో భాగంగా సాగుతున్న పవన్ కు చంద్రబాబు కూడా సానుకూల సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు సైతం టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడుతున్నారు