Politics

నేడే తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం

నేడే తెలంగాణ  కొత్త సచివాలయం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారు జామున 5:30 గంటల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య ఒకేసారి

కొలువుదీరనున్న సీఎం, మంత్రులు, అధికారులు

పోడు పట్టాల మార్గదర్శకాలపై సీఎం తొలి సంతకం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారు జామున 5:30 గంటల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై 1:20 గంటలకు పూర్తవుతుంది. ఆ తరువాత అర్చకులు నిర్ణయించిన పుష్కర అంశలో సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నేరుగా ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తరువాత మంత్రులు, అధికారులు కూడా వారి చాంబర్లకు వెళతారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య 6నిమిషాల వ్యవధిలో సీఎం సహా మంత్రులు, అధికారులు అందరూ ఏదో ఒక ఫైలుపై సంతకం చేసి పాలనను ప్రారంభిస్తారు. దీని తరువాత మధ్యాహ్నం 2:15 గంటలకు సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి అక్కడే సమావేశమై.. మంత్రులు, అధికారులతో మాట్లాడతారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు కలిపి 2,500 మంది హాజరు కానున్నారు.

తొలి సంతకం పోడు పట్టాల మార్గదర్శకాలపై

సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ తొలి సంతకం పోడు హక్కు పట్టాల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు దళితబంధు రెండో విడత అమలుకు మార్గదర్శకాల ఫైలు, సంక్షేమ శాఖలో మెస్‌ బిల్లుల పెంపు ప్రతిపాదన, ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల సాయంతోపాటు మరేదైనా కొత్త సంక్షేమ పథకం అమలు ఫైలుపై కూడా సీఎం సంతకం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా ఆ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. మరోవైపు లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్‌లలో రాకపోకలను నిలిపివేస్తున్నట్టు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉన్న లేజర్‌షోలను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌, సైఫాబాద్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

అత్యద్భుతంగా సచివాలయ నిర్మాణం: కేసీఆర్‌

నూతన సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అత్యద్భుతంగా సచివాలయాన్ని నిర్మించుకున్నామని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇది యావత్‌ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమన్నారు. ధృడ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం అనతి కాలంలోనే దేశానికి వన్నె తెచ్చేలా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని అభివర్ణించారు. అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన సచివాలయం.. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును గొప్పగా ప్రభావితం చేస్తూ గుణాత్మక మారున్పకు బాటలు వేస్తుందన్నారు. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకోవడం వెనుక సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యం ఉందని తెలిపారు.