అమెరికా తెలుగు సంఘం(ఆటా) సాహిత్యవేదిక డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో త్రిభాషా మహాసహస్రావధాని, శ్రీ ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ 16వ శతావధానం ఫ్రిస్కోలోని లాలర్ మిడిల్ స్కూల్‌లో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం వద్దిపర్తి దంపతులకు కనకాభిషేకం చేసి “అవధాన విశ్వగురుబ్రహ్మ” బిరుదును ఆటా ప్రతినిధులు అందజేశారు.
రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.మద్దూరి సత్యనారాయణ, డా.పుదూరు జగదీశ్వరన్‌లు సంచాలకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో 35సమస్యలు, 35వర్ణననలు, 35ఆశువులను వద్దిపర్తి రమణీయంగా పూర్తి చేశారు. కోవిదుడికి COVID వస్తే, వాలిని సంహరించింది వాయుకుమారుడు భీమసేనుడే, ధవునిన్ ద్రౌపది తన్నె మూతి పగులన్ ధర్మ ప్రకారంబుగన్ వంటి సమస్య/ఆశువులను వద్దిపర్తి సహేతుకంగా, ఛందోబద్ధంగా పూరించారు. వంగూరి చిట్టెన్‌రాజు, డా.యు.నరసింహారెడ్డి, శ్రీనాధ్(ఫ్లోరిడా)లు అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకులుగా రక్తి కట్టించారు.
ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, మాజీ అధ్యక్షురాలు గవ్వా సంధ్యారెడ్డి, DFW ఆటా నుండి శారద సింగిరెడ్డి, స్థానిక ప్రవాసులు మద్దుకూరి చంద్రహాస్, డా.ఇస్మాయిల్ పెనుకొండ, అనంత్ మల్లవరపు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, రమేష్ నెక్కంటి, డా.బీరం సుందరరావు తదితరులు పాల్గొన్నారు.