కీలక రంగాలలో మనోళ్ళు, అనేకులు యుద్ధ ప్రాంతానికి దూరం
సైనిక బలగాల మధ్య భీకర పోరులో సుడాన్ లోని తెలుగు ప్రవాసీయులు బిక్కు బిక్కుమంటున్నారు. కొందరు తెలుగు వాళ్ళు పని చేస్తున్న దూర ప్రాంతాలలో ఏలాంటి ఉద్రిక్తత, దాడులు లేకున్నా సరఫరాలు లేక క్రమేణా దుకాణాలు మూతపడడం, విద్యుత్, టెలిఫోన్ వ్యవస్ధలకు అంతరాయం ఏర్పడడంతో మున్ముందు సరఫరాలకు విఘాతం ఏర్పడితె ఇబ్బందులకు గురవుతామనె భయంతో మాతృభూమికు తిరిగి వెళ్తుండగా మరికొందరు ప్రత్యెకించి బాంబుల దాడులు తీవ్రంగా ఉన్న రాజధాని ఖార్తోంలో ఉన్న తెలుగు ప్రవాసీయులు ప్రాణాలను కాపాడుకోవడానికి వదలి వెళ్తున్నారు.
దేశంలో సుమారు 300 మంది వరకు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారని ఒక ప్రాథమిక అంచనా, వీరిలో అనేకులు గల్ఫ్ దేశాలలో పని చేసి ఇంకా అధిక వేతనాల కొరకు సుడాన్ కు వెళ్ళిన వారున్నారు. సుడాన్ లోని తెలుగు వారిలో అత్యధికులు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారుండగా వారిలో ఎక్కువ మంది సుడాన్ లోని చక్కెర, ఉక్కు మరియు సిరామిక్ పరిశ్రమలలో పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడికి చెందిన విద్యుత్ ప్లాంటు నిర్వహణ సంస్ధలో కూడ అనేక మంది పని చేస్తున్నారు. కొందరు హైద్రాబాద్ నగరానికి చెందిన ముస్లింలు అక్కడ వివాహాలు చేసుకోని అక్కడె స్ధిరపడ్డారు. పటాన్ చెరు బిహెచ్ ఇల్ కాలనీకు చెందిన మోహమ్మద్ జియా సుమారు మూడు దశాబ్దాలుగా కుటుంబ సమేతంగా ఉండి పైపుల ఫ్యాక్టరీ నిర్వహిస్తుండగా జియా మరియు అతని భార్య భారతదేశానికి వెళ్తున్నారు. హైద్రాబాద్ నగరానికి చెందిన కలీం అనే అతను సుడాన్ యువతిను ప్రేమించి పెళ్ళి చేసుకోగా తన భార్యను వదిలి వచ్చేదిలేదంటూ భీష్మించుకోన్నాడు, అతని భార్య రావడానికి మిషన్ కావేరి నిబంధనలు అనుమతించడం లేదు.
దేశ వ్యాప్తంగా పరిస్ధితి సాధారణంగా ఉన్నా ఒక్క రాజధాని ఖార్తోంలో మాత్రమే భీకర పరిస్ధితి నెలకోని ఉందని ప్రత్యక్ష సాక్షులు ఆంధ్రజ్యోతికు వివరించారు. ఖార్తోం నగర మరియు శివారు ప్రాంతాలలోని పారిశ్రామిక వాడలపై జరుపుతున్న బాంబుల దాడుల కారణాన ఈ పరిశ్రమలలో పని చేసున్న మరియు నగరంలో నివాసముంటున్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని నరకయాతన అనుభవిస్తున్నారు. తాను పని చేస్తున్న సంస్ధ అవరణలో భారీగా బాంబులు వేయడంలో ల్యాబ్ లో వారం రోజుల పాటు దాక్కోన్నట్లుగా నెల్లూరు జిల్లా సూళ్ళురుపేటకు చెందిన అందాడి ఆశోక్ చెప్పారు. భారతీయ వైమానిక దళ విమానంలో తరలించిన అనేక మందిలో ఒకడయిన ఆశోక్ … అతర్వాత అతని ఫ్యాక్టరీపై స్ధానికులు దాడి చేసి సామాన్లు ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు సందట్లో సడేమియాగా బయటకు వచ్చి భారతీయ ఎంబసీకు చేరుకోన్నాడు. ప్రాణంతో బయటపడింది చాలని కరీంనగర్ కి చెందిన బండి జయరాజు చెప్పగా పరిస్ధితి కుదుటపడిన తర్వాత తాను తిరిగి సుడాన్ వెళ్తానని హైద్రాబాద్ నగరానికి చెందిన అబ్దుల్ బారీ అంజద్ అన్నారు. తమ సంస్ధలో అందరు భారతీయులెనని, ఎవరు కూడ భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా లేకున్నా తమ నివాసంపై విసిరిన బాంబుల కారణాన భారతదేశానికి వెళ్ళవల్సి వస్తుందని ఆయన పెర్కోన్నారు. విద్యుత్ లేకపోవడంతో కేవలం అర్ధ గంట జనరేటర్ ఆన్ చేసి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ చేసుకోంటున్నట్లుగా ఖమ్మంకు చెందిన ఆర్. శ్రీనివాసరావు చెప్పారు. ఆయన గత 12 ఏళ్ళుగా సుడాన్ లో ఉంటున్నారు.
వీరందరు కూడ కేంద్ర ప్రభుత్వ మిషన్ కావేరిను అభినందిస్తూ ప్రభుత్వ చర్యకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు