Kids

550 మందికి తండ్రి అయ్యాడు. కోర్టు ఆదేశాలతో ఆగాడు

550 మందికి తండ్రి అయ్యాడు. కోర్టు ఆదేశాలతో ఆగాడు

నెదర్లాండ్స్‌కు చెందిన 41ఏళ్ల వ్యక్తిని, వీర్యదానం చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది.

జొనాథన్ అనే ఆ వ్యక్తి, వీర్యం దానం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 550 మందికంటే ఎక్కువ మంది పిల్లలను కన్నాడని భావిస్తున్నారు.

కోర్టు ఆదేశాలను కాదని వీర్యాన్ని దానం చేస్తే 88,000 డాలర్లు(రూ. 72.16 లక్షలు) జరిమానాను ఆయన కట్టాల్సి ఉంటుందని ద హేగ్ కోర్టు తీర్పు ఇచ్చింది.

అలాగే ఏయే ఆసుపత్రులకు వీర్యాన్ని దానం చేశాడో ఆ జాబితాను ఇవ్వాలని కూడా కోర్టు జొనాథన్‌ను ఆదేశించింది. ఆ ఆసుపత్రుల్లో నిల్వ ఉంచిన జొనాథన్ వీర్యాన్ని నాశనం చేయాలని కూడా తీర్పు ఇచ్చింది.

100 మందికంటే పైగా పిల్లలకు తండ్రి అయ్యాడని వార్తలు రావడంతో ఇకపై వీర్యాన్ని దానం చేయొద్దంటూ 2017లోనే జొనాథన్‌ను నెదర్లాండ్స్ ఆదేశించింది.

కానీ ఆయన మాత్రం ఆగలేదు. వందల మంది ఆడవాళ్లను తప్పుదారి పట్టించి, ఆయన వీర్యదానాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

25 కంటే ఎక్కువ మందికి తండ్రి కాకూడదు

నెదర్లాండ్స్ నియమాల ప్రకారం ఒక వ్యక్తి 25 కంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రి కాకూడదు. అందులోనూ ఆ పిల్లలు 12 కుటుంబాలకు చెందినవారై ఉండాలి.

ఒకే వ్యక్తి వీర్యదానం వల్ల ఎక్కువ మంది పిల్లలు పుడితే సమస్యలు వస్తాయని నెదర్లాండ్స్ భావిస్తోంది. ఒకే వ్యక్తి వీర్యంతో వేరువేరు చోట్ల పుట్టిన పిల్లలు, భవిష్యత్తులో జంటగా మారి పిల్లలను కనే అవకాశం ఉందని ఆ దేశం చెబుతోంది. అందువల్ల వీర్యదానం మీద నియంత్రణ ఉంచారు.

జొనాథన్, 2007లో వీర్యదానం ప్రారంభించాడని… నాటి నుంచి 550 నుంచి 600 మంది పుట్టడానికి కారణమయ్యాడంటూ జడ్జీలు తెలిపారు.

కోర్టుకు వెళ్లిన సంస్థ

వీర్యదానం వల్ల పుట్టిన పిల్లల హక్కులను కాపాడే సంస్థతోపాటు జొనాథన్ వీర్యంతో తల్లి అయినట్లు చెబుతున్న ఒక మహిళ ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు.

జొనాథన్ వీర్యంతో 100 మందికి పైగా పిల్లలు నెదర్లాండ్స్‌ ఆసుపత్రుల్లో జన్మించారు. మరికొందరు ఆసుపత్రుల్లో కాకుండా బయట పుట్టారు. ఒక నెదర్లాండ్స్ ఆసుపత్రి ఆయన వీర్యాన్ని ఇతర దేశాలకు కూడా పంపింది.

‘‘తల్లిదండ్రులు కావాలనుకునే వారికి ఆయన ఇకపై వీర్యాన్ని దానం చేయకూడదు. వీర్యదాతల కోసం వెతికే తల్లిదండ్రులను ఆయన సంప్రదించకూడదు. వీర్యదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ప్రకటనలు ఇవ్వకూడదు’’ అంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

వీర్యదానం వల్ల పుట్టిన పిల్లల సంఖ్య విషయంలో తల్లిదండ్రులను జొనాథన్ ‘‘తప్పుదారి పట్టించారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

సంతానసాఫల్యతకు సంబంధించిన ‘మోసాలు’ గతంలో కూడా నెదర్లాండ్స్‌లో జరిగాయి.

పేషెంట్ల అనుమతి లేకుండానే ఒక ఫెర్టిలిటీ డాక్టర్ తన సొంత వీర్యాన్ని వారికి ఎక్కించడం ద్వారా 49 మందికి తండ్రి అయినట్లు 2019లో ఆరోపణలు వచ్చాయి.