WorldWonders

మధురై మీనాక్షి కల్యాణోత్సవం

మధురై మీనాక్షి కల్యాణోత్సవం

🍁🍁🍁🍁🍁

మధువు అంటే అమృతం. త్రినేత్రుడైన శివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ‘మదురై’ అయిందని స్థలపురాణం చెబుతోంది. మీనాక్షీదేవి ఇక్కడే పాండ్యరాజుల వంశంలో జన్మించింది. మధుర మీనాక్షీ ఆలయం ఎత్తయిన రాజగోపురాలు కలిగిన ఆలయంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. వైగై నదీ తీరంలోని మదురై క్షేత్రమే నటరాజ శివుని రజత నాట్యపీఠం అని పురాణాలు వర్ణిస్తాయి. సౌరమానం ప్రకారం చైత్రమాసంలో మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమిళ పంచాంగాన్ని అనుసరించి చిత్తిరై మాసంలో మధుర మీనాక్షి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అప్పటినుంచి 30నాడు నిర్వహించే మీనాక్షీ పట్టాభిషేకం వరకు అనేక కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. మే 1న మీనాక్షి దిగ్విజయం, 2న మీనాక్షీ సుందరేశ్వరుల తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 3న రథోత్సవం, 4న తీర్థం ఉంటాయి. 5న అశ్వవాహనంపై మీనాక్షీ సుందరేశ్వరుల పెళ్లికి పెద్దగా వ్యవహరించిన పెరుమాళ్లును ఊరేగించే సేవలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొంటారు. మే 8న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.