ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన,అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన,రైతులకు పరామర్శ,టీడీపీ అండగా ఉంటుందని భరోసా,సీఎం జగన్ పై, మంత్రుల పై తీవ్ర ఆగ్రహం.
అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పరామర్శించారు. ఆయన ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వర్షాల కారణంగా తమకు జరిగిన నష్టాలను చంద్రబాబు నాయుడుకు రైతులు తెలియజేశారు. ధాన్యం సేకరణలో జాప్యం, సంచులు ఇవ్వకపోవడం, ఇతర నిబంధనలతో తాము పడుతున్న ఇబ్బందులను వారు చంద్రబాబుకు వివరించారు. తొలి రోజు పర్యటన అనంతరం చంద్రబాబు దువ్వలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు వ్యాఖ్యల ముఖ్యాంశాలు…
• అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
• తమ సమస్యలు చెప్పుకున్న రైతులను ప్రభుత్వం బెదిరిస్తోంది.
• కరోనా కాలంలో సైతం పని చేసి దేశానికి అన్నం పెట్టిన రైతును కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.
• ఉభయ గోదావరి జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం అంతా ఎప్పుడు కొంటారు?
• అకాల వర్షాలపై రైతులను ఎందుకు అప్రమత్తం చెయ్యలేదు?
• ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం కావాలి… కానీ అవ్వలేదు.
• రైతులకు ఇచ్చే గోనె సంచులు కూడా ఇవ్వలేదు. చిరిగిపోయిన సంచులు ఇచ్చారు.
• ఒక రైతు తన సొంత డబ్బు రూ.25 వేలు లారీకి చెల్లిస్తే తప్ప ఆయన ధాన్యం మిల్లు స్వీకరించలేదు.
• మిల్లర్లు నూక వస్తుందని రూ.80 నుంచి రూ.140 రూపాయలు రైతు నుంచి తీసుకుంటున్నారు.
• ఒకప్పుడు నచ్చిన విధంగా ధాన్యం తరలించే అవకాశం రైతులకు ఉండేది. నేడు ఆ విధానాన్ని తీసేశారు.
• మిల్లుల దగ్గర వెయిట్ చేయాల్సి వస్తే దానికి కూడా పెనాల్టీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు
• ప్రభుత్వ విధానాల వల్ల రైతుకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ. 30 వేలు నష్టపోతున్నాడు.
• తన నియోజకవర్గంలో ఉండే రైతుల గురించి పట్టించుకోని సివిల్ సప్లై మంత్రి ఎందుకు ?
• రైతులు కష్టాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు… పోరాడుదాం… పోరాడితే పోయేది ఏమీ లేదు.
• నేను పర్యటనకు వస్తాను అని చెప్పి లారీలు తెచ్చి ధాన్యం తరలించే ప్రయత్నం చేశారు.
• నేను వస్తాను అని చెప్పి ఉంటే దువ్వలో కూడా ధాన్యం ముందే తరలించే వారు.
• సీఎం అమరావతిలో కూర్చుని ఏం చేస్తున్నాడు… రైతుకు ఇంత కష్టం వస్తే ఎందుకు కదలడం లేదు?
• రైతుల దగ్గరకు జగన్ రావాలి… వారి కష్టాలు చూడాలి.
• భోగాపురానికి రెండోసారి ఫౌండేషన్ వేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు రైతుల కష్టాలు చూడండి.
• నాడు ప్రజలు ఓట్లు వేసింది మీ అధికారులకు కాదు… మీకు. నాడు ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?
• బస్తాకు రూ. 1,530 రూపాయలు మద్దతు ధర ఇచ్చి తీరాలి.
• గోనె సంచులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఏమనాలి?
• గోనె సంచుల్లో కమీషన్లు కొట్టేసిన పంది కొక్కులు ఎవరు?
• చినిగిపోయిన గోనె సంచులు ఇస్తారా?
• ఈ జిల్లాకు 2 కోట్ల గోనె సంచులు రావాలి. కానీ 20 లక్షల గోనె సంచులు మాత్రమే వచ్చాయి.
• మళ్లీ తుపాను ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. రైతుల్ని ఎప్పుడు ఆదుకుంటారు?
• ధాన్యం అమ్మే రైతులకు డబ్బులు ఇవ్వకపోగా… వారినే ఎదురు డబ్బులు కట్టమని అడుగుతున్నారు.
• రైతులు గళం ఎత్తితే వారిపైనా కేసులు పెడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. నేడు అండగా ఉంటాను.
• రైతుల సమస్యలు తీరే వరకు నేను ఇక్కడి నుంచి పోను.
• రైతుల ధాన్యం చివరి బస్తా కొనేవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రభుత్వ మెడలు వంచి అయినా వీరికి న్యాయం చేస్తాం.
• మొక్కజొన్న, పసుపు, వాణిజ్య పంటలకు జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి
• రైతులు తమకు జరిగిన నష్టం వీడియో తీసి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టండి. మీరు భయపడితే ఆ వీడియోలు నాకు పంపండి… నేను పెడతాను.
• ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు తిరగడం లేదు?
• ఈ సైకోలు ఏం చేస్తారు… కేసులు పెడతారు… భయపడతామా?
• రైతును ఉద్ధరించాం అని చెపుతున్న ప్రభుత్వం…. ఏం ఉద్ధరించిందో చెప్పాలి.
• మంత్రి సొంత నియోజకవర్గంలో గోనె సంచుల కోసం రైతుల ఆందోళన చేయడం సిగ్గుచేటు, దీనికి ఏం సమాధానం చెపుతారు?
• రైతుల్లో ఎంతో బాధ ఆవేదన ఉంది. ఇంత సమస్య ఉన్నా సీఎం కనీసం ఒక్క ప్రకటన చేయరు.
• ఈ ప్రభుత్వాన్ని దోషులుగా ప్రజా కోర్టులో నిలబెడదాం.
అంతకు మందు తాడేపల్లిగూడెం నందమూరులో శ్మశానంలో ఆరబోసిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… రైతులు శ్మశానంలో ధాన్యం ఆరబెట్టుకోవటం జగన్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనం అని విమర్శించారు.
అకాల వరదల కారణంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 70 శాతం ధాన్యం ఇంకా పొలాల్లో ఉందని వెల్లడించారు. అసమర్ద సీఎం వల్ల నిండా మునిగిపోయామని రైతులు వాపోతున్నారని, జగన్ రెడ్డి అసమర్ద పాలనతో రైతుల జీవితాల్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
“ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు, దళారులు తోచుకుంటున్నారు. తరుగు, తేమ అంటూ డబ్బుల్లో కోత కోస్తున్నారు. ఎకరాకు 60 బస్తాలు పండుతాయి, కానీ కేవలం 53 బస్తాలే కొంటారట, మరి మిగిలిన ధాన్యం ఎవరు కొనాలి? నేను వస్తున్నాని తెలిసి ఇప్పుడు హడావుడి అధికారులు ధాన్యం కొనుగోలు అంటూ డ్రామాలాడుతున్నారు. మరి మిగతా గ్రామాల్లో ధాన్యం పరిస్ధితి ఏంటి? ఏప్రిల్ మెదటి వారంలోనే ధాన్యం సేకరణ చేసి ఉంటే ఈ పరిస్ధితి ఉండేదా?
జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్ధానంలో ఉన్నాం, జగన్ ని నమ్ముకున్నందుకు రైతులు మరణం శాసనం రాసుకుంటున్నారు. సీఎం వచ్చి రైతులను పరామర్శించాలి, ధాన్యం ఎప్పటిలోగా కొనుగోలు చేస్తారో నిర్టిష్టమైన సమాధానం చెప్పాలి. ప్రతి రైతుకు న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా ఉంటుంది” అని చంద్రబాబు స్పష్టం చేశారు.