తానాలో బ్యాలెట్ కలెక్టర్లకు గొంతులో వెలక్కాయ పడింది. తానా 2023 ఎన్నికలు అంతర్జాలంలో ఈ-ఓటింగ్ ద్వారా నిర్వహించేందుకు మాజీ అధ్యక్షుడు డా.బండ్ల హనుమయ్య నేతృత్వంలోని తానా బోర్డు గురువారం నాడు ఆమోదముద్ర తెలిపింది. దీని ప్రకారం సభ్యులకు 2023 ఎన్నికల్లో వారి చిరునామాలకు పోస్టల్ బ్యాలెట్లు పంపబడవు. తానా ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు తమ ఓటు హక్కును అంతర్జాలంలో వినియోగించుకుని ఈ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తానా ఎన్నికల్లో సభ్యుల చిరునామాల ఆధారంగా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం బ్యాలెట్లను సభ్యుల నుండి నేరుగా గానీ వారికి తెలియకుండా వారి మెయిల్‌బాక్స్‌లలో నుండి గానీ సమీకరించి, తమకు అనుకూలమైన, గాడ్‌ఫాదర్లు బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసుకుంటారనే పుకారు ఒకటి ప్రచారంలో ఉంది. ఈ పుకారును షికారుకు పంపేలా, తానాలో ఓట్ల కోసమే సొంత నిధులను వెచ్చించి ఒకే చిరునామాపై కోకొల్లలుగా జేరే/జేర్పించే నకిలీ సభ్యులకు గండిపడేలా ఈ ఈ-ఓటింగ్ ప్రక్రియకు ఆమోదం తెలపడం పట్ల ప్రవాసులు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు.