NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

సింగపూర్‌లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో తెరుసన్‌ రిక్రియేషన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సింగపూర్‌లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో తెరుసన్‌ రిక్రియేషన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. తెలుగులో కార్మిక సోదరుల వృత్తి నైపుణ్య పరీక్షలకై తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందన్నారు. తొలిదశలో ఐదు కోర్సులు ఆమోదం పొందాయని, సింగపూర్ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. ఇక్కడ నివసిస్తున్న వలస కార్మిక సోదరులకు దురదృష్టవశాత్తు జరిగిన పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భీమా ప్రణాళికపై తెలుగు సమాజం పనిచేస్తుందని వెల్లడించారు. ఇదే విషయాన్ని భారతదేశ హై కమీషన్ దృష్టికి తీసుకువెళ్లామని, దీనికి ఊతమిచ్చేలా బీమా లబ్దిదారుల పరిధిని పెంచేందుకు చొరవతీసుకున్నారని చెప్పారు.

ప్రస్తుతానికి కొత్తగా ఇక్కడకు వచ్చేవారు మాత్రమే ఈ నూతన బీమా పరిధిలోకి వచ్చేలా అనుమతులొచ్చాయని, ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న కార్మిక సోదరులను కూడా ఈ భీమా పరిధిలోకి వచ్చే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అనుమతుల పక్రియ చివరి దశకు వచ్చిందన్నారు.

కార్మికసోదరుల కోసం తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి ప్రశంసించారు. ఏపీఎన్నార్టీ ప్రవాస బీమా గురించి వివరించడంతోపాటు ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధప్రాంతాలకు విమానసర్వీసులకై తన పరిధిలో కృషిచేస్తానని హామి ఇచ్చారు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన పాటలతో సభికులను ఉత్తేజపరిచారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తనదైన రీతిలో జానపదగీతాలతో అలరించారు. వైవిధ్య కళాకారుడు రవి పిల్లల్ని, పెద్దల్ని తన మాయాజాలంతో అందర్నీ మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమం కోసం కార్మిక సోదరుల కోసం 3 వారాంతాల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీల్లో గెలిచిన వారికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న బహుమతులను ప్రదానం చేయడంతోపాటు ప్రైజ్ మనీ అందించారు.

ఈ కార్యక్రమాన్ని విజయంతం కావటానికి సహకరించిన అందరికీ, స్పాన్సర్స్‌కు, క్రీడాకారులకు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయగా సుమారు 3,700 మంది వీక్షించారని, భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలను తెలుగు సమాజం నిర్వహిస్తుందని చెప్పారు. గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని నూతన కమిటీ మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్లు గౌరవ కార్యదర్శి అనిల్ పొలిశెట్టి తెలిపారు.