ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్
5 గంటల్లోపే తిరిగి విమానాశ్రయానికి
హైదరాబాద్: మే07
యువ సంఘర్షణ పేరుతో ఈ నెల 8న సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి తెలంగాణలో ఇది తొలి రాజకీయ సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక.. ఆ రోజు తనకున్న టైట్ షెడ్యూల్‌లో అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించగలిగారు. ఒక విధంగా ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బెంగళూరు నుంచి సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రియాంకగాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సరూర్‌నగర్ స్టేడియానికి సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. ఆ వెంటనే ఆమె హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 5.30 గంటల ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంటారు. మొత్తంగా సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ 45 నుంచి 50 నిమిషాలపాటు గడపనున్నట్లు వెల్లడించాయి. ప్రియాంక సభ జరిగే 8న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రోజుహైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఒకింత ఆందోళన నెలకొంది.