అందరూ బలరాముడిని వెతుకుతూ వెళ్ళారు. ఆ సమయములో బలరాముడు ఒకచెట్టు కింద యోగ సమాధిలో కూర్చుని ఉన్నాడు. కృష్ణుడు దారికుని చూసి ” దారుకా ! నీవు వెంటనే హస్థినకు వెళ్ళు. ఇక్కడ యాదవ కులము అంతా సర్వనాశనము అయింది అని చెప్పి అర్జునుడిని తీసుకురా ! ” అని అన్నాడు. వెంటనే దారుకుడు రథము ఎక్కి హస్థినకు వెళ్ళాడు. కృష్ణుడు బభ్రుడిని చూసి ” నీవు వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉన్న స్త్రీలను అంతఃపుర జనాలను ద్వారకకు చేర్చు ” అన్నాడు. సరే అని బభ్రుడు వెళ్ళబోతున్న సమయములో అంతలో అటుగా వెడుతున్న బోయవాడి చెతిలోని తుమ్మపరక ఎగిరి వచ్చి బభ్రుడికి తగిలి బభ్రుడు అక్కడికక్కడే మరణించారు. ఋషుల శాప ప్రభావము చూసి కృష్ణుడు సైతము ఆశ్చర్యపోయాడు. తరువాత కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళి ” అన్నయ్యా ! నువ్వూ నేను తప్ప యాదవులు అందరూ మరణించారు. నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు ” అన్నాడు. తరువాత కృష్ణుడు సముద్రతీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. తరువాత తండ్రి వసుదేవుడి వద్దకువెళ్ళి ” తండ్రీ ! నేను భారతయుద్ధము చూసాను. అక్కడ కురుపాండవులు నాశనము కావడము చూసాను. ఈ రోజు యాదవులు అందరు కొట్టుకుని మరణించడము చూసాను. మీరు, నేను, బలరాముడు తప్ప యాదవులు అందరూ మరణించారు. బంధువులు, మిత్రులు లేని చోట నేనిక ఉండలేను. నా కంటే ముందుగా బలరాముడు యోగసమాధి లోకి వెళ్ళాడు. నే కూడా వెళ్ళి అతడితో పాటు తపసు చేస్తాను. ఇక్కడ విషయాలు అన్నీ ఇక మీరు చూసుకోండి. నేడో, రేపో అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు మీకు తోడుగా ఉంటాడు ” అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు వసుదేవుడి పాదములకు నమస్కరించాడు. అప్పటికే యాదవుల మరణవార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యము కోల్పోయి నిశ్చేష్టుడై స్ప్రృహ తప్పిపడిపోయాడు. వసుదేవుడి పరిస్థితి చూసి అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేసారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ ” ఏడవకండి. అర్జునుడు ఇక్కడకు వస్తాడు. అతడు ఇక్కడ చెయవలసిన పనులు చేస్తాడు. నేను అన్నగారి వద్దకు వెడతాను ” అని చెప్పి బలరాముడి వద్దకు వెళ్ళి ” అన్నయ్యా ! అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చాను. తండ్రిగారి అనుమతి తీసుకుని ఇక్కడకు వచ్చాను ” అన్నాడు. బలరాముడిలో చలనము లేదు. బలరాముడి ముఖము నుండి ఒక పెద్ద నాగము వెలువడి బయటకు రాగానే బలరాముడు యోగశక్తితో ప్రాణములు శరీరము నుండి వదిలి పెట్టాడు. బలరాముడి ప్రాణాలు సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశములో కలిసిపోయాయి. ఆదిశేషుడి అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురుగా వచ్చి స్వాగతము పలికింది. నాగ ప్రముఖులు అందరూ బలరాముడి ఆత్మకు స్వాగతము పలికారు. అలా బలరాముడు విష్ణులోకములో ప్రవేశించి చివరకు విష్ణుమూర్తిలో కలసి పోయాడు.