ఫుల్ యాక్షన్ సీన్స్ తో అదిరిపోయింది నిఖిల్ స్పై టీజర్. కార్తికేయ 2 తర్వాత అతడు మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ నటించిన స్పై మూవీ టీజర్ సోమవారం (మే 15) రిలీజైంది. ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ ఓ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ ను అందించేందుకు సిద్ధమైంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ. అయితే ఈ సినిమా చరిత్రలో ఓ రహస్యంగా మిగిలిపోయిన ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ మరణం చుట్టూ తిరిగే స్టోరీలా కనిపిస్తోంది.
ఆ సీక్రెట్ తెలుసుకునే ఓ గూఢచారిగా నిఖిల్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కాబోతోంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడం విశేషం. భగవాన్ జీ ఫైల్స్ మిస్ అయ్యాయంటూ మకరంద్ దేశ్‌పాండే చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. అతడు చెప్పే ఆ భగవంతుడి పేరు సుభాష్ చంద్రబోస్. ఆయన 1945లో ఓ విమాన ప్రమాదంలో చనిపోయాడన్నది అంతా కవరప్ స్టోరీ అంటూ ఆయన మరణం ఓ రహస్యమన్న వాదనకు మద్దతు పలికేలా ఈ మూవీ టీజర్ ఉంది.
ఆ మిస్టరీని స్పై నిఖిల్ ఛేదిస్తాడా లేదా అన్నది ఈ మూవీలో చూడొచ్చు. టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. దేశ చరిత్రలో అతిపెద్ద సీక్రెట్ గా నిలిచిపోయిన సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సబ్జెక్ట్ నే ఈ మూవీ టీమ్ కథగా ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది.
కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సంపాదించిన నిఖిల్ సిద్ధార్థ.. ఈ మూవీతో మరోసారి దుమ్మురేపేలా ఉన్నాడు. గ్యారీ బీహెచ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్ లో విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా, ఓ హైబడ్జెట్ మూవీలాగా ఉన్నాయి. స్పై రోల్ లో నిఖిల్ అదుర్స్ అనిపించేలా ఉన్నాడు. ఒకరకంగా ఈ టీజర్ మూవీపై అంచనాలు భారీగా పెంచేసింది.
ఇక స్పై మూవీలో ఐశ్వర్య మేనన్, సాన్యా ఠాకూర్ ఫిమేల్ లీడ్ గా కనిపిస్తున్నారు. ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమటం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కే రాజశేఖర్ రెడ్డి స్క్రిప్ట్ అందించాడు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.