Food

తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్…

తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్…

వచ్చే నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులుపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణపై సచివాలయంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. స్వయం ఉపాధి కోసం మత్స్యకార మహిళలకు చేపలతో వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఈ ఫెస్టివల్‌లో 20 నుంచి 40 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అలాగే, మత్స్య రంగానికి సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించనున్నట్టు మంత్రి తెలిపారు.