బ్లవుజులకు చేయించుకున్న మగ్గం వర్క్‌లో చాలా వెరైటీలున్నాయి. వాటిలో ఈ మధ్య ప్రత్యేకంగా నిలుస్తున్నాయీ త్రీడీ మగ్గం వర్క్ బ్లవుజులు. వాటితో పాటే ట్రెండింగ్ లో ఉన్న మరికొన్ని ఫ్యాషన్ ముచ్చట్లు తెలుసుకుందాం.
బ్లవుజులకు మగ్గం వర్క్ చేయించుకోవడం తప్పనిసరి అయిపోయింది. దాదాపు ప్రతి పట్టు చీర బ్లవుజుకు మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గ డిజైన్లు మార్కెట్లో వస్తూ ఉంటాయి. కాస్త భిన్నంగా ఉన్న త్రీడీ మగ్గం వర్క్, త్రెడ్ మగ్గం వర్క్, జర్దోసీ వర్క్ ఇలా ప్రత్యేకంగా ఉండే మగ్గం వర్కుల గురించి మీరూ తెలుసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో పెళ్లయినా, మీ పెళ్లయినా ట్రెండ్ కి తగ్గ డిజైన్లు కుట్టించుకోవాల్సిందే మరి.
3డీ మగ్గం వర్క్:అంటే బ్లవుజులో ఇమిడిపోయే మగ్గం వర్క్ కాకుండా ఈ త్రీడీ పనితనం బ్లవుజు పైన లేచినట్లు ఉంటుంది. అంటే వర్క్ చేసిన ఆకారం మనం చేతుల్తో తాకినా, చూసినా స్పష్టంగా తెలుస్తుంది. ఈ డిజైన్ తయారీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు పైన ఫొటోలో ఉన్న నెమళి ఈకలు త్రీడీలో డిజైన్ చేయడానికి, ఒక్కొక్క ఈకను వేరువేరుగా మగ్గం వర్క్ చేసి దాన్ని బ్లవుజు మీద ఆకారానికి తగ్గట్లు కుట్టేస్తారు. చీరకు తగ్గట్లు వివిధ రంగుల్లో ఈ నెమళ్లనే కాదు త్రీడీ ఎఫెక్ట్ ఉండేలా ఏ డిజైన్ అయినా చేయించుకోవచ్చు. కేవలం భుజం దగ్గర త్రీడీ వర్క్, లేదా బ్లవుజు చేతుల అంచులకు.. ఇలా ఇష్టానికి తగ్గట్లు ఈ త్రీడీ వర్క్ చేసిస్తారు. ఈ వర్క్ పెళ్లి కూతురుకి, దగ్గరి ఫంక్షన్లకి ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ఈ త్రీడీ వర్క్ లో నెమళికి సంబంధించిన డిజైన్లు మాత్రం చాలా ట్రెండ్ అయిపోయాయి.
త్రెడ్ వర్క్:ఇవి కూడా దాదాపు 3డీ డిజైన్ లాగే కనిపిస్తాయి. కాకపోతే శాటిన్ రిబ్బన్, త్రెడ్ వర్క్ తో త్రీడీ ఎఫెక్ట్ వచ్చేలా పూలూ, ఆకులు ఇతర డిజైన్లు కలిపి మగ్గం వర్క్ చేస్తారు. ఇవి పట్టు చీరలకే కాకుండా కాస్త ట్రెండీగా ఉండే ఫ్యాన్సీ చీరలకు కూడా వర్క్ వేయించుకోవచ్చు. పెళ్లి బ్లవుజుల్లో కూడా ఈ సిల్క్ దారంతో చేసిన పూలని వాడుతున్నారు. వాటివల్ల కొత్త లుక్ వస్తుంది. వీటిని చేయటానికి ప్రత్యేక మెషీన్లు కూడా వచ్చాయిపుడు.
వంకీ డిజైన్:కొన్ని చీరలకు ఎక్కువ వర్క్ వచ్చినపుడు, లేదా సాదాగా ఉండేలా వర్క్ చేయించుకోవాలి అనుకున్నపుడు ఈ వంకీ డిజైన్ బ్లవుజులు బాగుంటాయి. అంటే మగ్గం వర్క్ బ్లవుజు మొత్తం రాకుండా కేవలం బ్లవుజు స్లీవులకు మాత్రమే అరవంకీ లాంటి డిజైనింగ్ ఉంటుంది. దాన్ని కూడా జర్దోసీ పనితనంతో, సీక్వెన్స్, గోల్డ్ వర్క్, ఎండ్రాయిడరీ తో చేయించుకోవచ్చు. చూడటానికి వంకీ పెట్టుకున్నట్లు ఉంటుంది.