తల్లికి అనారోగ్యంగా ఉందంటూ చివరి నిమిషంలో విచారణకు దూరం,ఈ రోజు ఆయనను అరెస్టు చేస్తారంటూ ఊహాగానాలు,కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈ రోజు సీబీఐ అరెస్టు చేస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కేసులో హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సీబీఐ ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాంతో, అవినాశ్ అరెస్టు కోసం భద్రత కట్టుదిట్టం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అవినాశ్ ఈ ఉదయం 11 గంటలకే హాజరు కావాల్సి ఉండగా తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ విచారణకు వెళ్లకూడదని చివరి నిమిషంలో ఆయన నిర్ణయించుకున్నారు.ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూసేందుకు ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించినట్టు తెలుస్తోంది. అరెస్టు వార్తల నేపథ్యంలో మద్దతుదారులు, అనుచరులు సైతం భారీగా ఆయన నివాసానికి చేరుకున్నారు. కాగా, ఈ కేసులో సీబీఐ అవినాశ్ ను ఇప్పటికే ఆరుసార్లు విచారించింది.