ఉత్తర ఇటలీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర ఇటలీలో నదులు పొంగిపొర్లుతుండటంతో పట్టణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు అక్కడ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కేవలం 36 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో వార్షిక వర్షపాతంలో సగం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎమిలియ-రొమగ ప్రాంత అధ్యక్షుడు స్టెఫానో బోనాసిని తెలిపారు. ఈ వరదలు ముఖ్యంగా వ్యవసాయాన్ని దెబ్బతీసినట్లు చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. అందుకే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం’ అని అన్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. ఈ వరదలకు సుమారు 5 వేల ఎకరాలకుపైగా పంట పొలాలు నీట మునిగాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఎమిలియ రొమగ ప్రాంతంలో 300 పైగా కొండ చరియలు విరిగిపడ్డాయి. సుమారు 23 నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా దాదాపుగా 400 రోడ్లు దెబ్బతిన్నాయి. సుమారు 10వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు పాక్షికంగా విద్యుత్‌ను పునరుద్ధరించినప్పటికీ.. సుమారు 27,000 మంది ప్రజలు ఇంకా అంధకారంలోనే ఉన్నారు.