సినిమా లెజెండ్ రజినీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? అలాంటి దృశ్యాన్నే రజినీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె మెగాఫోన్ చేతబట్టి ‘లాల్ సలాం’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోంది. క్రికెట్, కమ్యూనిజం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కపిల్ దేవ్, రజినీ ఇద్దరూ తళుక్కున మెరవనున్నారు.
ఈ క్రమంలో వీరికి సంబంధించిన సన్నివేశాలను తాజాగా ఆమె తెరకెక్కించింది. ఈ సమయంలో కపిల్, రజినీ మాట్లాడుకుంటున్న ఫొటోను రజినీకాంత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కపిల్ దేవ్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా రజినీ అభివర్ణించాడు. ఈ ట్వీట్‌పై చాలా మంది అభిమానులు స్పందించారు.
‘అత్యంత గౌరవనీయులైన, అద్భుతమైన వ్యక్తి లెజెండ్ కపిల్ దేవ్ గారితో కలిసి పని చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఆయన మొట్టమొదటి సారి క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా దేశం గర్వించేలా చేసిన ఆయనతో స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం’ అని రజినీ కాంత్ ట్వీట్ చేశాడు.
దీనిపై ‘లాల్ సలాం’ చిత్ర డైరెక్టర్, రజినీ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ కూడా స్పందించింది. కపిల్, రజినీ ఇద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలను తెరకెక్కించడం తనకు దక్కిన ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది. ‘ఈ సన్నివేశాలను తెరకెక్కించే అదృష్టం దక్కడం నిజంగా గర్వంగా ఉంది. నాకు ఆశీర్వాదం లభించినట్లుంది నాన్నా. మీ ఇద్దరూ ఇరగదీశారు’ అని ఆమె రిప్లై ఇచ్చింది.
ఈ చిత్రంలో వీళ్లిద్దరూ కాదు మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా భాటియా, రమ్యకృష్ణ తదితరులు చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.