తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇన్నాళ్లు టాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయిన అతడు.. RRR తర్వాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను కొరటాల శివతో కలిసి చేస్తోన్నాడు. ప్రస్తుతం అతడు ఈ సినిమాను సంబంధించిన షూటింగ్లో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు.
పాన్ ఇండియ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కాకుండా ‘కేజీఎఫ్’ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ ప్రాజెక్టును చేయబోతున్నాడు. దీనితో పాటు బాలీవుడ్లో స్పై థ్రిల్లర్ సిరీస్‌గా వచ్చిన ‘వార్’ సీక్వెల్లో నటించబోతున్నాడని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. ‘వార్ 2’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో తారక్.. బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మూవీని ‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నట్లు కూడా తెలిసింది. తాజాగా హృతిక్ చేసిన ట్వీట్‌తో ఈ సినిమాపై అదిరిపోయే క్లారిటీ వచ్చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటోన్నాడు. ఈ సందర్భంగా అతడికి దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతోన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా బర్త్‌డే విషెస్ చెప్పాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. ఈ పుట్టినరోజు హ్యాపీగా సాగిపోవాలి. రానున్నది యాక్షన్ ప్యాక్డ్ ఇయర్. నీ కోసం యుద్ధ భూమిలో ఎదురుచూస్తున్నా మిత్రమా. నువ్వు సుఖసంతోషాలతో జీవించాలి. మనం కలిసే వరకు… పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా!’ అని రాసుకొచ్చాడు.
హృతిక్ రోషన్ తాజాగా ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేసిన ఈ ట్వీట్‌తో వీళ్లిద్దరూ కలిసి ‘వార్ 2’లో నటించడాన్ని పరోక్షంగా కన్ఫార్మ్ చేసేశాడు. అంటే.. ఇప్పుడు తారక్ నిజంగానే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పుకుంటోన్నారు. ఇక, హృతిక్ చేసిన ఈ ట్వీట్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.