మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దీని నిర్మాణ పనులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంగా ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 11,464 కోట్ల రూపాయలు. తొలి దశలో 5,156 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
దీని వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు. ఎగుమతి-దిగుమతుల కార్యకలాపాల కోసం నాలుగు బెర్త్‌లను నిర్మిస్తారు. క్రమంగా వాటి సంఖ్యను 10కి పెంచుతారు. ప్రతి సంవత్సరం 115 మిలియన్ టన్నుల నిర్వహణ సామర్థ్యంతో ఈ పోర్ట్ రూపుదిద్దుకోనుంది. 24 నుంచి 30 నెలల వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని జగన్ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనివల్ల 25 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.