Editorials

హనుమ…సముద్ర లంఘన సందేశం………

హనుమ…సముద్ర లంఘన సందేశం………

రామాయణంలో – అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఘట్టాల్లో ఒకటి ఆంజనేయుడి సముద్ర లంఘనం.

సీతాన్వేషణలో భాగంగా అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనవారు దక్షిణ దిశకు వెళ్తారు.
మారుతి మీదున్న నమ్మకంతో తన గుర్తుగా సీతకు ఇవ్వమని చెప్పి అంగుళీయకాన్ని హనుమంతుడికి ఇస్తాడు రాముడు.

జంబుద్వీపం దక్షిణ కొసకు చేరుకున్న వానర సైన్యానికి విశాలమైన సముద్రం ఎదురైంది, దాంతో లంకను చేరుకోలేమేమో అన్న సందేహం ఏర్పడింది.

చివరికి సంపాతి సాయంతో లంకా ద్వీపం జాడ తెలుసుకుంటారు, అయితే శతయోజన పర్యంతం విస్తరించిన సముద్రాన్ని ఎలా దాటాలి? వానరులు, జాంబవంతుడు అంతా తమ అశక్తతను వెల్లడిస్తారు.

అంగదుడు నాయకుడు కాబట్టి అతను వెళ్లకూడదు, దాంతో మిగిలిన ఒకే ఒక్కడు హనుమంతుడికి అతని బలం గురించి జాంబవంతుడు గుర్తుచేస్తాడు.

అలా సముద్రాన్ని ఆకాశమార్గంలో దాటడానికి సిద్ధమవుతాడు మారుతి. ఇలా ఉంటే నిత్యజీవితంలో తలపెట్టే ఏకార్యమైనా సరే ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది అనుకోవద్దు…

కష్టాలను దాటుకొని సాధించిన దానినే గెలుపుగా పరిగణిస్తారు, ఆంజనేయుడికి కూడా సముద్ర లంఘనంలో అయిదు ఆటంకాలు ఎదురయ్యాయి.

1. మొదటిది విశాలమైన సముద్రాన్ని దాటడం!

జాంబవంతుడి ప్రోత్సాహం మేరకు మహేంద్రగిరి మీదినుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడే మొదటి ఆటంకాన్ని దాదాపుగా అధిగమించినట్లయింది.

2. ఆకాశంలో విష్ణుచక్రంలా దూసుకుపోతున్న హనుమంతుడికి మైనాకుడు అనే పర్వతం రూపంలో రెండో ఆటంకం ఏర్పడుతుంది.

మారుతిని అడ్డగించిన మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించమంటాడు. అయితే హనుమంతుడు తాను రామకార్యం మీద లంకకు వెళ్తున్నానని, మధ్యలో ఆగనని చెబుతాడు. లక్ష్యంపట్ల ఆంజనేయుడికి ఉన్న చిత్తశుద్ధికి మైనాకుడు సంతోషిస్తాడు. అలా మంచిదే అయినప్పటికీ ప్రయాణంలో ఆలస్యానికి కారణమయ్యే రెండో ఆటంకాన్ని దాటుతాడు.

3. ఆ తర్వాత దేవతలు మరో పరీక్ష పెడతారు.
హనుమను అడ్డగించమని నాగమాత సురసను అడుగుతారు. దాంతో మారుతి గమనానికి అడ్డుపడుతుంది సురస. తనకు ఆహారం కాకుండా ఎవ్వరూ తననుంచి తప్పించుకోలేరని అంటుంది.
తాను సీతాన్వేషణలో ఉన్నానని, విషయం రాముడికి చేరవేసిన తర్వాత స్వయంగా ఆహారం అవుతానంటాడు. ఆమె ఒప్పుకోదు, దాంతో హనుమంతుడు తన దేహాన్ని విపరీతంగా పెంచుతాడు.

సురస కూడా తన నోటిని పెంచుతూపోయింది. ఇంతలో హనుమ తన దేహాన్ని సూక్ష్మంగా చేసుకొని సురస నోటిలోకి ప్రవేశించి, వెంటనే బయటికి వస్తాడు. మారుతి తెలివికి ఆశ్చర్యపడిన సురస అతని కార్యం సఫలమవుతుందని దీవిస్తుంది. అలా తెలివితో మూడో ఆటంకాన్నీ అధిగమిస్తాడు ఆంజనేయుడు.

4. ఇంతలో సింహిక రూపంలో నాలుగో ఆటంకం ఎదురవుతుంది, ఆమె ఛాయాగ్రాహి, ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడను పసిగట్టి వాటిని తన నోట్లోకి లాక్కుంటుంది.
హనుమంతుణ్నీ అలానే చేయబోతుంది, అయితే ఆయన తన శరీరాన్ని పెంచుతూ పోయి సింహిక ఆయువుపట్టును గుర్తిస్తాడు. ఆమె నోట్లో ప్రవేశించి ఆయువుపట్టును బద్దలుకొట్టి బయటికి వస్తాడు.
తన ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించిన సింహికను పూర్తిగా మట్టుపెడతాడు మారుతి.

5. సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్న వాయుపుత్రుడికి లంకిణి రూపంలో అయిదో ఆటంకం అడ్డుపడుతుంది. లంకిణిని ఒక్క పిడిగుద్దుతో అడ్డు తొలగించుకొని హనుమ లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. దాంతో రావణుడికి అంతిమ ఘడియలు సమీపిస్తాయి…

బాలుడిగా ఉన్నప్పుడే సూర్యుడిని అందుకునేందుకు ఆకాశానికి ఎగిరాడు హనుమ.
అలాంటిది శ్రీరామచంద్రుడి ముద్రిక దగ్గర ఉంచుకొని సముద్రాన్ని దాటి, లంకకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశం కాదంటాడు తులసీదాసు హనుమాన్‌ చాలీసాలో.

దీనినే…
‘ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి/ జలధి లాంఘి గయే అచరజ నాహి’ అని అక్షరీకరించాడు.

కార్యసాధనలో మనం కూడా తెలివి, ధైర్యం, నిశితమైన పరిశీలన, బలం, నేర్పుతో ఆంజనేయుడిలా ఆటంకాలను అధిగమించాలన్న సందేశం ఇస్తుంది సముద్ర లంఘన ఘట్టం…