Movies

హీరో అజిత్ న్యూ బిజినెస్….

హీరో అజిత్ న్యూ బిజినెస్….

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. తన అభిరుచికి అనుగుణంగా కొత్త కంపెనీని నెలకొల్పారు. ఆయన టేస్ట్ ఏమిటనేది అందరికీ తెలిసిన విషయమే. అదే- బైక్ రైడింగ్. వందల కిలోమీటర్ల మేర బైర్ రైడింగ్ చేయడం ఆయనకు చాలా ఇష్టం. షూటింగ్స్ లేని సమయంలో ఆయన ఒంటరిగా బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటారు.

ఇప్పుడు అదే సెగ్మెంట్‌లో కొత్త మోటార్ సైకిల్ టూరింగ్ కంపెనీని నెలకొల్పారు. దీని పేరు- ఏకే మోటో రైడ్. బైక్‌పై లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి, అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వారి కోసమే ఈ కంపెనీని ఏర్పాటు చేశారాయన. ఈ కంపెనీ ద్వారా- బైక్ రైడ్స్, అడ్వెంచర్స్ టూర్స్ అంటే ఇష్టపడే వారికి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ కంపెనీ ద్వారా దేశంలోని తరచూ బైక్ అడ్వెంచర్ టూర్‌లను నిర్వహిస్తామని అజిత్ కుమార్ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ప్రకృతి అందాలను వెలికి తీయగలుగుతామని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా- అంతర్జాతీయ రోడ్లపైనా రయ్యి మంటూ దూసుకెళ్లే అవకాశాన్ని బైక్ రైడర్స్‌కు కల్పిస్తామని ఈ ప్రకటనలో ఆయన వివరించారు.

బైక్ రైడింగ్ పట్ల తనకు ఉన్న అభిరుచిని ప్రొఫెషన్‌గా మార్చుకున్నానని, తనలాగే బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే వారికోసం ఏకే మోటో రైడ్ ద్వారా బైక్ రైడర్స్, అడ్వెంచర్స్ ఎంథూసియాస్ట్స్‌లకు ఇదో చక్కని అవకాశాన్ని కల్పించదలచుకున్నట్లు అజిత్ కుమార్ చెప్పారు. వాస్తవ జీవితానికి, బైక్ రైడింగ్‌కు దగ్గరి సంబంధం ఉందని వ్యాఖ్యానించారు.

జీవితం కూడా ఓ అందమైన రైడ్ వంటిదేనని, బైక్ రైడింగ్ చేస్తోన్నప్పుడు ఎదురయ్యే అనుభవాల తరహాలోనే జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయని పేర్కొన్నారు. బైక్‌పై లాంగ్ డ్రైవ్, అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి తగిన భద్రత, సౌకర్యాలను కల్పించడంలో ఏకే మోటో రైడ్ నిబద్ధతతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. అలాంటివారికి అడ్వెంచర్ టూరింగ్ సూపర్‌బైక్‌లను అందిస్తామని చెప్పారు.

బైక్ టూర్‌లో అనుభవం ఉన్న వారిని ప్రొఫెషనల్ గైడ్‌గా అపాయింట్ చేశామని, ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా అక్కడి సమగ్ర సమాచారాన్ని, స్థానిక ఆచార వ్యవహారాలు, సంస్కతి సంప్రదాయాల గురించి విస్తృతమైన పరిజ్ఞానం ఉన్న వారు గైడ్స్‌గా ఉంటారని అజిత్ కుమార్ అన్నారు. ఒక్కో అడ్వెంచర్ టూరిజానికి ఎంత ఛార్జీని తీసుకుంటారనేది ఇంకా వెల్లడి కాలేదు.