Politics

పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదు: ఖర్గే

పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదు: ఖర్గే

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్రం ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు చేశారు. నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కూ ఆహ్వానం పంపలేదని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే దళిత, గిరిజన రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు ఈ పరిణామాలు అర్థం చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై విమర్శలు సంధించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపలేదని పేర్కొన్నారు. పార్లమెంటు భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా ఆహ్వానించలేదని విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్నదని, రాష్ట్రపతి కార్యాలయానికి కేవలం స్టాంప్‌నకు ఉపయోగించుకుంటున్నదని ఆరోపణలు చేశారు.

ఈ నెల 28వ తేదీన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారని లోక్‌సభ సెక్రెటేరియట్ ప్రకటనతో తెలుస్తున్నది.

ఈ సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విట్టర్ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రపతిగా ఒక దళితుడిని, ఒక గిరిజన మహిళను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఎన్నుకున్నట్టుగా ఈ పరిణామాలతో అర్థం అవుతున్నదని విమర్శించారు.

నూతన పార్లమెంటు భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదని, ఇప్పుడు అదే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని పేర్కొన్నారు.

గణతంత్ర భారత దేశానికి ఉన్నత చట్టసభ పార్లమెంటు అని, రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగబద్ధ ఉన్నతమైన అథారిటీ అని వివరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కరే మొత్తం ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని, దేశ ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఆమెనే దేశ ప్రథమ పౌరురాలనీ పేర్కొన్నారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ఆమె ప్రారంభిస్తే.. కేంద్రంలోని ప్రభుత్వం దేశ ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగబద్ధ పాలనకు గౌరవిస్తుందనే సంకేతాన్ని ఇచ్చినట్టవుతుందని వివరించారు. కానీ, మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తరుచూ అగౌరవపరిచారని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని కేవలం టోకెనిజానికి మాత్రమే ఈ బీజేపీ ఆరెస్సెస్ ప్రభుత్వం కుదించిందని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26వ తేదీన అంటే.. ఈ ఏడాది నవంబర్ 26తో 75 ఏళ్లు నిండుతాయని, అలాంటి రోజున కాకుండా మే 28వ తేదీన అదీ సావర్కర్ జయంతి నాడు నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ఔచిత్యం అవుతుందా? అని టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ట్వీట్ చేశారు.