తెలుగు సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. మే 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన. మొదట చెన్నై, బెంగళూరులో చికిత్స తీసుకున్న ఆయన.. మెరుగైన వైద్యం కోసం నెల రోజుల క్రితం.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి శరత్ బాబు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు.
సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. శరత్ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదా ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు. రామరాజ్యంలో చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు శరత్ బాబు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులు అందుకోవడం విశేషం.శరత్ బాబు, రమాప్రభ మధ్య ఇప్పటికి తేలని వివాదం ఉంది. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు.