Movies

బ్రో మూవీలో అదిరిపోయే బాలీవుడ్‌ భామతో ఐటెం సాంగ్‌….

బ్రో మూవీలో అదిరిపోయే బాలీవుడ్‌ భామతో ఐటెం సాంగ్‌….

దాదాపు ఇరవై ఏళ్లకు పైగా సినీ హీరోగా ప్రయాణం ఉన్నప్పటికీ.. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడు రాకెట్ వేగంతో ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తోన్నాడు.

ఇలా ఇప్పటికే పలు సినిమాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ‘బ్రో (BRO)’ మూవీ ఒకటి. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘వినోదయ సీతమ్’ సినిమాకు ‘బ్రో (BRO)’ రీమేక్‌గా వస్తుంది. దీన్ని ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను గత ఫిబ్రవరిలో మొదలు పెట్టారు.

ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన చాలా వరకు షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌పై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ నేటి నుంచి పాల్గొన్నట్లు తెలిసింది.

మెగా హీరోల కలయికలో రాబోతున్న ‘బ్రో (BRO)’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఈ పాటలో ఏ హీరోయిన్‌ను తీసుకుంటారు అన్న దానిపై మాత్రం ఎన్నో రకాల ఊహాగానాలు వస్తున్నాయి.

ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శృతి హాసన్, దిశా పటానీలతో సంప్రదింపులు జరుపుతుందట. వీళ్లిద్దరిలో ఎవరి డేట్స్ అయితే అనువుగా ఉంటాయో వాళ్లు ఫైనల్ చేస్తారని తెలిసింది. ఈ సాంగ్ ఓ పబ్ సెట్‌లో జరగబోతుందని సమాచారం. ఇందులో పవన్, సాయి తేజ్ ఇద్దరూ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా చేస్తోన్న ‘బ్రో (BRO)’ చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేయనున్నారు.