ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సిడ్నీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆస్ట్రేలియాకు మళ్లీ వస్తానని 2014లోనే మీకు వాగ్దానం చేశాను… మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చి నా వాగ్దానం నిలబెట్టుకున్నా అని వెల్లడించారు. ఒకప్పుడు భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని మూడు ‘సీ’లు నిర్వచించేవని, అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అని వివరించారు. ఇప్పుడది ‘3డీ’ గా మారిందని అన్నారు. ‘3డీ’ అంటే డెమొక్రసీ, డయాస్పోరా, దోస్తీ అని అభివర్ణించారు. అంతేకాదు, భారత్, ఆస్ట్రేలియా దేశాలను యోగా, సినిమాలు కూడా కలిపి ఉంచుతాయని వివరించారు. ఆస్ట్రేలియా ప్రజలు మంచివారు, విశాల హృదయులు అని ప్రధాని మోడీ కొనియాడారు.
“భారతీయులను ఆస్ట్రేలియా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ భాషలన్నీ వినిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అనేక ప్రాంతాలు భారతీయులకు ప్రత్యేకమైనవి. ముఖ్యమైన భారతీయ వంటకాలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయి. సిడ్నీలోని ప్రపంచ ప్రఖ్యాత ఓపెరా హౌస్ పై భారత జెండా కనిపించడం సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా స్థాయిలో భారత్ కూడా త్వరగా అభివృద్ధిని అందుకోవాలి. మొబైల్ వినియోగంలో భారత్ నెంబర్ వన్ గా ఉంది. ఫిన్ టెక్ రంగంలోనూ భారతదేశమే అగ్రగామి. పాల ఉత్పత్తి రంగంలోనూ భారత్ కు తిరుగులేదు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిది. ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంలా చూస్తున్నాం. ప్రపంచం మేలు కోసం కూడా భారత్ కృషి చేస్తుంది. వసుధైక కుటుంబం అన్నది మా నినాదం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రాణాలను భారత్ కాపాడింది. కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్లు అందించాం. భారత్ 100కి పైగా దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చింది” అని వివరించారు