కుమారుణ్ని విదేశాల్లో ఉన్నత చదవులు చదివించి.. గొప్పవాణ్ణి చేయాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. అనుకున్నట్లుగానే ఎంతో కష్టపడి ఆర్నెళ్ల క్రితమే అమెరికా పంపించగా..
కుమారుణ్ని విదేశాల్లో ఉన్నత చదవులు చదివించి.. గొప్పవాణ్ణి చేయాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. అనుకున్నట్లుగానే ఎంతో కష్టపడి ఆర్నెళ్ల క్రితమే అమెరికా పంపించగా.. చక్కగా చదువుకుంటున్న కుమారుణ్ని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. నిన్నటి వరకు ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడిన తమ కుమారుడు ఇక లేడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామానికి చెందిన బోయ వెంకట్రాములు, శకుంతల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు బోయ మహేశ్(25) ఇంజనీరింగ్ పూర్తిచేయడంతో… ఎంఎస్ చదవడానికి గత డిసెంబరులో అమెరికా పంపించారు. మంగళవారం రాత్రి మహేశ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాడు. అక్కడి నుంచి అందరూ కలిసి తిరిగి వారు ఉండే ప్రాంతానికి వస్తుండగా, కారు అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.మిగిలిన ముగ్గురు స్నేహితులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని మృతుని తోటి స్నేహితులు అతడి తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చేందుకు బుధవారం బంధువులు, గ్రామస్థులు బారులు తీరారు. ‘మా కుమారుడి మొఖం చూపించండి.. ఇండియాకు మృతదేహాన్ని తెప్పించండి’ అంటూ మృతుడి తల్లిదండ్రులు తమను పరామర్శించేందుకు వచ్చిన వారిని రెండు చేతులు జోడించి, వేడుకుంటూ చేసిన రోదనలు అక్కడున్నవారందరినీ కన్నీళ్లు పెట్టించాయి.