ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ‘‘కర్మలు చేయకుండా మనలో ఏ ఒక్కరూ ఒక్క క్షణమైనా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతి వల్ల పుట్టిన రాగద్వేషాల్లాంటి గుణాల వల్ల ప్రేరేపితుడై మానవుడు కర్మలు ఆచరించక తప్పదు’’ అని ‘భగవద్గీత’లో చెప్పాడు. ఎలకా్ట్రన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే మూడు పరమాణు కణాలు మొత్తం భౌతిక ప్రపంచాన్ని ఏర్పరుస్తాయి. అదే విధంగా సత్వ, తమో, రజో అనే మూడు గుణాలు కర్మలు చేసేలా మనల్ని నడిపిస్తాయి. కాబట్టి, అసలైన కర్తలు అవే. ‘‘ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి, వాటి ద్వారా కర్మలను ఆచరించకుండా, మనసుని ఇంద్రియ సంబంధమైన విషయాల చుట్టూ తిప్పుతూ ఉంటారో… వాళ్ళు వివేకం లేనివాళ్ళు, తమను తాము మభ్యపెట్టుకుంటూ ఉంటారు’’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు.
కుటుంబ స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ… మంచి ప్రవర్తనకు ప్రతిఫలాన్ని అందించి, చెడు ప్రవర్తనకు శిక్ష విధించే ఒక వ్యవస్థ ద్వారా మనం పెరిగాం, దాని పాలనలో ఉన్నాం. దీని ఫలితంగా అంతర్గత, బాహ్య ప్రవర్తనల మధ్య పొంతనలేని ద్వంద్వ ప్రవృత్తి మనలో కలుగుతోంది. ఉదాహరణకు, ఎవరైనా వ్యక్తి మనని బాధ పెట్టినప్పుడు, మంచి ప్రవర్తనను ప్రదర్శించడం కోసం మాటలపరంగా, చర్యలపరంగా మనల్ని మనం నిగ్రహించుకోవచ్చు. కానీ మెదడు ద్వేషంతో, క్షోభతో, అన్యాయం జరిగిందన్న భావంతో నిండిపోతుంది. ఇలా అణచివేసుకోవడాన్నీ, మొద్దుబారిపోవడాన్నీ శ్రీకృష్ణుడు ఎప్పుడూ సమర్థించలేదు. దాన్ని ‘మిధ్య’ (భ్రమ)గా ఆయన పేర్కొన్నాడు. దానికి బదులు… బాధనూ, ప్రశంసనూ సమానంగా పరిగణించే సమత్వాన్ని సాధించాలని, తద్వారా ద్వంద్వత్వం మాయమవుతుందనీ ఆయన బోధించాడు.
దుస్థితిలో జీవించాలని ఎవరూ కోరుకోరు, కానీ దానినుంచి బయటికి ఎలా రావాలో కొద్దిమందికే తెలుస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు తక్షణం ఒక పరిష్కారాన్ని కూడా అందించాడు. కర్మయోగాన్ని అనుసరించి, మోహరహితంగా అవయవాలను కర్మలో నిమగ్నం చేయాలని సూచించాడు. ‘మోహం’ లేదా ‘బంధాలు’ లేకపోవడం అనేది ప్రధానాంశం. అంటే ‘గుణాలే అసలైన కర్త’ అని గ్రహించి, కర్తతో అనుబంధం లేకుండా, కర్మఫలంతో సంబంధం లేకుండా కర్మను ఆచరించడం.