తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి. శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కుమారుడు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
నందమూరి రామకృష్ణ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమాలలోనే కాదు, రాజకీయాల్లోనూ అగ్రగామిగా నిలిచారని బాలకృష్ణ తెలిపారు.
ఆయన కుమారుడుగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న బాలకృష్ణ రాజకీయాలలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలను వివరించారు.తెలుగు వారి రుణం తీర్చుకోవడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రత గా మారిందని పేర్కొన్నారు.
ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన ఆయన తన తాత కు ఘనంగా నివాళులు అర్పించి ఆ మహనీయుని స్మరించుకొని ఎమోషనల్ అయ్యారు. ఆయన మనవడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నివాళులు అర్పించటం కోసం వస్తున్నక్రమంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు క్రిక్కిరిసిపోయారు.