వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ మోసాలు రాస్తే రామాయణం, వింటే మహా భారతం అవుతుందని ఆమె సెటైర్లు వేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి పై ప్రతిపక్షాలు ప్రజలకు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
ప్రతిపక్షాలు చేసేది గోబెల్స్ ప్రచారమైతే.. గత తొమ్మిదేళ్లుగా అబద్దాల పాలన చేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏమనాలని ఆమె ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారానికి సీఎం కేసీఆర్ ఇంకా బీఆర్ఎస్ మంత్రులు నిజమైన వారసులని ఆమె ఫైర్ అయ్యారు. ఇక బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని 4.50 లక్షల అప్పుల కుప్పగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు.
ఇక ఇంత అప్పు చేసినా సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని, చివరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా దిక్కు లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనుకబాటు నుంచి వెలుగులోకి కాదు.. బీఆర్ఎస్ ధనదాహంతో అంధకారంలోకి వెళ్లిందని ఆమె అన్నారు. బీఆర్ఎస్ అరాచకాలను ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు, గృహ నిర్భందాలు, సంకెళ్లు విధిస్తున్నారని.. షర్మిల విమర్శించారు.