చైనా (China) సొంతంగా నిర్మించిన ప్రయాణికుల విమానం (Domestically Built Plane) సీ919, వాణిజ్యపరంగా తొలిసారి గాల్లోకి ఎగిరింది. ఆదివారం మొదటి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ విమానం ఆదివారం ఉదయం 10.32 గంటలకు షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 12.31 గంటలకు రాజధాని బీజింగ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. 164 సీట్లు ఉన్న ఈ విమానంలో తొలిసారి 130 మంది ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆ ప్రయాణికులకు విమాన సిబ్బంది గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. అలాగే వారికి విలాసవంతమైన భోజనాన్ని సర్వ్ చేశారు. చైనా దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ విమానం సోమవారం నుంచి రెగ్యులర్‌గా సేవలందించనున్నది. షాంఘై నుంచి చెంగ్డుకు ప్రయాణించనున్నది.
కాగా, సొంతంగా ప్రయాణికుల విమానాలను తయారు చేసిన చైనా, పశ్చిమ దేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనున్నది. పౌర విమానాల నిర్మాణానికి కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా శ్రీకారం చుట్టింది. సీ919 కమర్షియల్ విమానాన్ని ఆ సంస్థ అభివృద్ధి చేసింది. చాలా ఏళ్ల తర్వాత 2017లో తొలిసారి ఆ విమానం ఎగిరింది. గత ఏడాది సెప్టెంబర్‌లో చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనికి టైప్ సర్టిఫికేట్ మంజూరు చేసింది. 2022 డిసెంబర్ 26న వంద గంటల సుదీర్ఘ జర్నీని ఈ విమానం పూర్తి చేసింది. అలాగే భద్రతాపరమైన అన్ని ప్రమాణాలను నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈ విమానం రెగ్యులర్ సర్వీసులను చైనా ప్రారంభించింది.