సోనూ సూద్ ఈ పేరు మానవత్వానికి మారుపేరుగా మారిపోయింది. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికి నిజ జీవితంలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సోనూ సూద్ నిరుపేదల పిల్లలకోసం మరో కీలక నిర్ణయం తీసుకుని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని నిర్ణయించుకున్నారు.
సోనూ సూద్ బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చేదు గుర్తులు ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరి జీవితాలను అల్లకల్లోలం చేసింది కరోనా. అటువంటి విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ పేదవారికి బాసటగా నిలిచారు. ముఖ్యంగా పేదవారికోసం షెల్టర్ లు ఏర్పటు చేయడం, వారికి నత్యావసర సరుకులు అందించడం చేశారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు తన సొంత ఖర్చులతో రవాణా సౌకర్యాన్ని కల్పించారు. కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి చేరదీశారు. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా అనాథ పిల్లల కోసం మరో పనికి శ్రీకారం చుట్టారు.
బిహార్ లోని కతిహార్ ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని విడిచి సోనూ సూద్ పేరిట ఓ పాఠశాలను నిర్మించి 110మంది అనాథ పల్లలకు విద్యనందిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆ ఇంజనీర్ ను కలిసి ప్రశంసించారు. అక్కడ విద్యతో పాటు విద్యార్థులకు ఆహారం, షెల్టర్లు ఉండం చూసి సోనూసూద్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎక్కువ మంది పిల్లలకు లబ్ధి కలిగేలా మరో బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలని సోనూసూద్ సంకల్పించారు. అనాథ పిల్లలకు అత్యుత్తమ విద్యనందించడానికి ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. పేదరికాన్ని రూపుమాపడానికి చదువు ఒక్కటే మార్గమని, నిరుపేద పిల్లలకు విద్యనందిస్తే వారు ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. ఇప్పటికే సోనూసూద్ దేశంలోని సుమారు పదివేల మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోనూ సూద్ విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.