ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‍కు మరో ఫీచర్ రానుంది. వీడియో కాల్స్ కోసం ఓ నయా సదుపాయాన్ని వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. గూగుల్ మీట్, జూమ్ లాంటి వీడియో కాలింగ్ ప్లాట్‍ఫామ్‍ల్లో ఉన్నటువంటి స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను తెచ్చేందుకు వాట్సాప్ రెడీ అయింది. ఈ విషయాన్ని డబ్ల్యూఏబీటా రిపోర్ట్ వెల్లడించింది. బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం ఇప్పటికే ఈ స్క్రీన్ షేర్ ఫీచర్‌ను వాట్సాప్ అప్‍డేట్ చేసిందని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా పని చేస్తుందంటే.
వాట్సాప్‍లో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతలి వారికి మీ స్క్రీన్‍ను ప్రెజెంట్ చేసేందుకు ఈ స్క్రీన్ షేర్ (Screen Share) ఆప్షన్ ఉపయోగపడుతుంది. స్క్రీన్ షేర్‌పై క్లిక్ చేస్తే వీడియో కాల్‍లో ఉన్న వారందరికీ మీ స్క్రీన్‍ను షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా 2.23.11.19 వెర్షన్‍కు వాట్సాప్ ఇస్తోంది. బీటా టెస్టర్లు ఈ వెర్షన్‍కు అప్‍డేట్ అయి ఈ స్క్రీన్ షేర్ ఆప్షన్‍ను ఉపయోగించుకోవచ్చు.
వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో కింది భాగంలో ఈ స్క్రీన్ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‍పై క్లిక్ చేస్తే స్క్రీన్ ఎప్పటికప్పుడు రికార్డ్ అయి.. వీడియో కాల్‍లో ఉన్న అవతలి వారికి ట్రాన్స్‌మిట్ అవుతుందని డబ్ల్యూఏబీటా పేర్కొంది. ఇలా స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పింది.
ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. బీటా టెస్టింగ్ తర్వాత సాధారణ యూజర్లందరికీ రోల్అవుట్ చేస్తుంది వాట్సాప్. ఫీచర్ ఎలాంటి బగ్స్ లేకుండా పని చేస్తుందని నిర్ధారించుకున్నాక యూజర్లందరికీ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే గూగుల్ మీట్, జూమ్ వీడియో కాలింగ్ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉంది.
కాగా, ఇటీవల ఎడిట్ మెసేజ్ ఫీచర్ రోల్ అవుట్‍ను యూజర్లందరికీ ప్రారంభించింది వాట్సాప్. రానున్న వారాల్లో అందరికీ ఈ ఎడిట్ మెసేజ్ యాడ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే.. మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు దాన్ని ఎడిట్ చేయవచ్చు. మెసేజ్‍లో ఏదైనా తప్పు ఉంటే మళ్లీ పంపాల్సిన అవసరం లేకుండా.. అదే మెసేజ్‍ను ఎడిట్ చేయవచ్చు. కాగా, ఇటీవల చాట్ లాక్‍ను కూడా రోల్అవుట్ చేసింది వాట్సాప్. దీని ద్వారా వాట్సాప్‍లో ఏ చాట్‍కైనా ప్రత్యేకంగా లాక్ వేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు క్రమంగా యూజర్లందరికీ అందుబాటులోకి వస్తాయి.