చైనాలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో దేశంలో 16-24 ఏళ్ల మధ్య వయసున్న వారి నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 20.4 శాతానికి చేరుకుందని చైనా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నట్లు ఖబర్‌హబ్ తెలిపింది. మరో 11.6 మిలియన్ల మంది విద్యార్థులు కాలేజీ, వృత్తి విద్యా పాఠశాలల నుండి గ్రాడ్యుయేట్ కానున్నారు. అంటే వీరు జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు జాబ్ మార్కెట్ లోకి ప్రవేశించడానికి ఒక నెల ముందు గణాంకాలు విడుదలయ్యాయి.
16 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. పని లభించకపోవడాన్ని యువ నిరుద్యోగితగా వ్యవహరిస్తారు.ఇది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 20.4 శాతం గరిష్ఠానికి చేరుకుంది. అంతకుముందు నెలలో 19.6 శాతంగా ఉంది. అయితే, అక్కడి యువతలో నిరుద్యోగానికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం 2018 నుంచి వరుసగా ప్రకటిస్తోంది. ఆ ఏడాది ఇది 11.2 శాతంగా ఉండగా.. తాజాగా అది 20 శాతానికి చేరుకుంది. జులైలో చదువు పూర్తిచేసుకున్న కోటి మందికిపైగా పట్టభద్రులు జాబ్ మార్కెట్‌లోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇతర అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలతో పోలిస్తే చైనాలో యువత నిరుద్యోగిత భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో 2022లో సరాసరి నిరుద్యోగిత 8.1శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది (2021లో) 9.57 శాతంగా ఉండగా, 2020లో కరోనా సమయంలో గరిష్ఠంగా 27.4 శాతంగా రికార్డయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాత్రం అక్కడ 6.5 శాతంగా ఉంది. ఇక హాంకాంగ్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో యువత నిరుద్యోగిత రేటు 7 శాతం లోపే ఉంది.