NRI-NRT

రష్యాపై డ్రోన్ల దాడి…

రష్యాపై డ్రోన్ల దాడి…

రష్యా రాజధాని మాస్కోపై మరోసారి డ్రోన్ దాడి జరిగింది. దీంతో పలు భవనాలు దెబ్బతినడంతో పాటు ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ నెలలో మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. అంతకు ముందు రష్యా అధ్యక్ష భవనమే టార్గెట్గా డ్రోన్ దాడి జరగడంతో పుతిన్ను అత్యవసరంగా బంకర్లోకి తరలించారు.

ఈ దాడులపై మాస్కో ప్రాంత గవర్నర్‌ ఆండ్రీ మాట్లాడుతూ మాస్కో వైపుగా తరలివస్తున్న పలు డ్రోన్లను కూల్చివేశామని టెలిగ్రామ్‌ ఛానెల్‌లో పేర్కొన్నారు. ఈ డ్రోన్లను ఎక్కడి నుంచి.. ఎవరు ప్రయోగించారనే విషయం స్పష్టంగా తెలియలేదు. మాస్కో శివార్లలో కొన్ని డ్రోన్లను కూల్చేశారు. కొంత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్‌ ఈ ఉగ్ర దాడులకు కారణమని రష్యా ఆరోపించింది. దాడి కోసం ప్రయోగించిన 8 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడికి కారణమైన కుట్రదారులను గుర్తిస్తున్నామని పేర్కొంది.

మాస్కోపై డ్రోన్‌ దాడులతో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్‌ వెల్లడించింది. ‘‘వాస్తవానికి దాడుల తీవ్రం కావడం చూసి సంతోషిస్తాం. కానీ, వాటితో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఉక్రెయిన్‌పై చేసిన దాడులకు రష్యా కర్మఫలం అనుభవించడం క్రమంగా పెరుగుతోంది’’ అని ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు మైఖెలోవ్‌ పొడల్యాక్‌ పేర్కొన్నారు.