NRI-NRT

న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో కోటికి అరుదైన గౌరవం…

న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో కోటికి అరుదైన గౌరవం…

తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు.. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కోటి (Koti). మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, కోటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సాలూరి కోటేశ్వర రావు ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఇది తెలుగు సినిమా పాటకి జరిగిన పట్టాభిషేకం, ఆ పాటకి ప్రాణం పోసిన సంగీతానికి కలిగిన అరుదైన అవకాశం అని ఆయన అభిమానులు చెబుతున్నారు.

న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమంలో కోటి.. తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. మెంబర్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ జూలియా ఫిన్.. ఈ పురస్కారాన్ని కోటికి అందజేశారు. పురస్కారంలో భాగంగా కోటికి ఒక జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరించారు.

పురస్కారం స్వీకరించిన అనంతరం కోటి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు, ఐక్యరాజ్యసమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను అందుకున్న ఈ పురస్కారాన్ని భారతదేశానికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ పురస్కారం తనకు ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కవ అని అన్నారు.