వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి.
2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి.
2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది.