చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్‌వెల్ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. వాయవ్య చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో గల తారిమ్ బేసిన్‌లో ఈ బోర్‌వెల్ తవ్వుతున్నది. ఈ బోర్‌వెల్ భూమి లోపలి 10 రాతి పొరల నుంచి చొచ్చుకెళ్లనున్నది.
భూమి పుట్టుక, కాలక్రమంలో వచ్చిన మార్పులు, జీవ పరిణామాన్ని, గతంలో సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూభాగం లోతుల్లో కొత్త విషయాలను అన్వేషించడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా ఉన్న వాంగ్ చున్‌షెంగ్ తెలిపారు.