ScienceAndTech

భవిష్యత్తులో ఏఐ వల్ల మా జాబ్స్ డేంజర్ లోకి పోతాయ్‌….

భవిష్యత్తులో ఏఐ వల్ల మా జాబ్స్ డేంజర్ లోకి  పోతాయ్‌….

కృత్రిమ మేధ(AI) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతాయంటే కొన్నేళ్ల కిందట వరకు ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్​బాట్​ చాట్​జీపీటీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్​జీపీటీ వల్ల కృత్రిమ మేధ సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాల్లో కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధ వల్ల సాఫ్ట్​వేర్​ సహా పలు రంగాల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. దీంతో ఆయా రంగాల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.భారత్‌లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్‌ వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ 2023’ ప్రకారం..

90 శాతం మంది భారతీయ కంపెనీల నిర్వాహకులు, ఏఐ వృద్ధికి తగ్గట్లుగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.వినూత్నత కొరవడుతోందని నాలుగింట మూడొంతుల(84%) సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. సమావేశాలు సరిగ్గా జరగకపోవడమే. తాము సగం సమావేశాలకు హాజరుకాకపోయినా సహచరులు గుర్తించలేకపోతున్నారని 46% మంది సిబ్బంది భావిస్తున్నారు.ఏఐ నిపుణులే కాదు.. ప్రతి ఉద్యోగి తమ రోజువారీ పనుల్లో భాగంగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలని నివేదిక అభిప్రాయపడింది.

ఏఐ వల్ల రోజువారీ పనుల్లో భారీ మార్పులు రావొచ్చు. సరికొత్త ఉత్పాదకత వృద్ధి దశకు తదుపరి తరం ఏఐ తలుపులు తెరవగలదు. వీటి వల్ల పనుల్లో కఠినత్వం తొలగుతుంది. ఉల్లాసంగా, వినూత్నంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే ప్రతి సంస్థా, ఉన్నతాధికారులు ఆ దిశగా ఏఐను అందిపుచ్చుకోవాలి. ప్రతి ఉద్యోగి భవిష్యత్‌ అవసరాలకు కొత్త దారులు వేసేలా ఏఐని పరీక్షించి, అందించాల’ని మైక్రోసాఫ్ట్‌ కంట్రీ హెడ్‌ భాస్కర్‌ బసు పేర్కొన్నారు