జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారానికి సిద్దం అవుతున్నారు. పవన్ ప్రచార రధం వారాహి రోడ్డెక్కనుంది. ఇందుకు రంగం సిద్దం అవుతోంది. గత ఏడాది దసరా నుంచే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు నిర్ణయించారు. కానీ..వాయిదా పడింది. తన ప్రచారం కోసం పవన్ కల్యాన్ వారాహి సిద్దం చేసుకున్నారు. పూజలు పూర్తి చేసారు. తొలి సారిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు పవన్ ప్రయాణించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ ఇప్పుడు పవన్ ఎన్నికల కసరత్తులో భాగంగా వారాహితో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్దం అయ్యారు.
పవన్ కల్యాణ్ ఈ నెలాఖరు నుంచి వారాహి యాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. రోడ్ మ్యాప్ పైన చర్చించారు. గోదావరి జిల్లాల నుంచే పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. ఎక్కడ నుంచి ప్రారంభించాలనే దాని పైన పవన్ నిర్ణయం ప్రకటించనున్నారు. ఒకే విడతగా రాష్ట్రం మొత్తంగా కాకుండా ఒక్కో విడతలో రెండు జిల్లాల చొప్పున పర్యటన కొనసాగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో జనసేన బలం పైన అంచనాలు ఎక్కువగా పెట్టుకుంది. ఆ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. సామాజిక సమీకరణాల్లోనూ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.