Politics

పరారీలో ఏపి ఉద్యోగ సంఘం నేత….

పరారీలో ఏపి ఉద్యోగ సంఘం నేత….

ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నాయకులకు చిక్కులు తప్పడం లేదు. ప్రభుత్వంపై గవర్నర్కూ ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది.
వాణిజ్య పన్నులశాఖలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం..అరెస్టుకు ఆదేశించింది.రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సూర్యనారాయణ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి ఉద్యోగులు గండికొట్టారని ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఏ -5గా సూర్యనారాయణను చేర్చారు.

ఈ కేసును ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే విజయవాడ పోలీసులు నడుచుకుంటున్నారు. కేసు నమోదు, అరెస్ట్ వరకు ఏ దశలోనూ వివరాలు బయటకు రాకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని సూర్యనారాయణ శుక్రవారం ఉదయం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఫోన్లు సైతం వదిలేసి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగులను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు తీసుకొచ్చిన సందర్భంలోనూ ఆయన కోర్టు వద్దకు వచ్చారు. అప్పుడే ఈ కేసులో తనపేరూ చేర్చారని తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.

మరో వైపు ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ ధృవపత్రాలు జారీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణాధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ను నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ ఆఫీసు బేరర్ లేఖలు, ధృవ పత్రాలు ఏపీజీఈఏ జారీ చేస్తోందన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్టీఓలు, ఎస్ఆర్ఓ, ఏటీఓ, సీటీఓలు, డీసీటీవోలు, వైద్యులకు, వివిధ విభాగాల ఉద్యోగులకు ఏపీజీఈఏ నకిలీ లేఖలు జారీ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు పొందేలా ఈ నకిలీ లేఖల్ని వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్ హోదాలో ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్నారు. అయితే, పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సూర్యనారాయణ పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది. కేఆర్ సూర్యనారాయణతో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న మరికొంతమందితో కలిసి జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని డబ్బుల కోసం డీలర్లు, వ్యాపారులను బెదిరించారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.