Sports

ఫ్రెంచ్ ఓపెన్ విశేషాలు….

ఫ్రెంచ్ ఓపెన్ విశేషాలు

23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన టెన్నిస్‌ దిగ్గజం జకోవిచ్‌ (సెర్బియా) ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కష్టంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఈ మూడో సీడ్‌ ఆటగాడు 7-6 (7-4), 7-6 (7-5), 6-2 తేడాతో 29వ సీడ్‌ డేవిడోవిచ్‌ ఫొకినా (స్పెయిన్‌)పై పోరాడి గెలిచాడు. తొలి సెట్‌ ఆరంభం నుంచే ఇద్దరు క్రీడాకారులు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. అయిదో గేమ్‌లో జకో సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఫొకినా 3-2తో ఆధిక్యం సాధిస్తే.. తర్వాతి గేమ్‌లోనే సర్వీస్‌ బ్రేక్‌ చేసి మళ్లీ 3-3తో జకో స్కోరు సమం చేశాడు. 5-6తో వెనుకబడ్డ దశలోనూ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి జకో 6-6తో పోరును టైబ్రేకర్‌కు మళ్లించాడు. అందులో విన్నర్లతో సత్తాచాటి పైచేయి సాధించాడు. ఒకరు ఆధిక్యంలోకి వెళ్లడం.. వెంటనే మరొకరు స్కోరు సమం చేయడం.. రెండో సెట్‌ ఇలాగే సాగింది. అందులోనూ టైబ్రేకర్‌లో జకోదే గెలుపు. మూడో సెట్లో జకో జూలు విదిల్చాడు. 3-0తో ఆధిక్యం సాధించిన అతను.. అదే ఊపులో మ్యాచ్‌ ముగించాడు. ఈ పోరులో జకో 3 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. మరోవైపు ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 7-5, 6-0, 3-6, 6-7 (5-7), 3-6తో సొనెగో (ఇటలీ) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రెండు సెట్లు గెలిచి.. విజయం వైపు దూసుకెళ్లిన రుబ్లెవ్‌కు మూడో సెట్లో బ్రేక్‌ పడింది. వరుసగా మూడు సెట్లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 11వ సీడ్‌ కచనోవ్‌ (రష్యా) 6-4, 6-1, 3-6, 7-6 (7-5)తో కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా)పై, సెబాస్టియన్‌ (ఆస్ట్రియా) 5-7, 6-3, 7-5, 1-6, 6-4తో ఫాగ్నిని (ఇటలీ)పై నెగ్గారు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మరో సీడెడ్‌ తిరుగుముఖం పట్టింది. ఈసారి మూడో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా) వంతైంది. అలాగే పురుషుల ఏడో సీడ్‌ రుబ్లేవ్‌ కూడా నిష్క్రమించాడు. టైటిల్‌ ఫేవరెట్‌ జొకోవిచ్‌, మహిళల రెండో సీడ్‌ సబలెంకా ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో 28వ సీడ్‌ ఎలైస్‌ మెర్టెన్స్‌ (బెల్జియం) 6-1, 6-3 స్కోరుతో వరుస సెట్లలో పెగులాను కంగుతినిపించింది. టోర్నీలో ఇప్పటికే మహిళల ఐదో సీడ్‌ కరోలిన్‌ గార్సియా, ఎనిమిదో సీడ్‌ సకారి, 10వ సీడ్‌ పెట్రా క్విటోవా పరాజయం పాలైన సంగతి తెలిసింది. మరో మూడో రౌండ్‌లో పవ్ల్యుచెన్కోవా 4-6, 6-3, 6-0తో రష్యాకే చెందిన అనస్టాసియా పొటపోవాపై నెగ్గింది. అలాగే రెండో సీడ్‌ అర్యానా సబలెంకా (బెలారస్‌), 9వ సీడ్‌ డారియా (రష్యా), స్టోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), స్విటోలినా (ఉక్రెయిన్‌) ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జొకోవిచ్‌ 7-6 (4), 7-6 (5), 6-2 స్కోరుతో ఫోకినా (స్పెయిన్‌)పై విజయంతో ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో 11వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)..కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేశాడు.సాకేత్‌ జోడీ ఓటమి : డబుల్స్‌ రెండో రౌండ్‌లో సాకేత్‌ మైనేని/యుకీ భాంబ్రీ జోడీ 4–6, 5-7 స్కోరుతో మెక్సికో, ఫ్రాన్స్‌ ద్వయం గొంజాలెజ్‌/ రోజర్‌ వాసిలిన్‌ చేతిలో పరాజయం పాలైంది.