DailyDose

కూతురిని హీరోయిన్ చేయాలని తల్లి పైశాచికత్వం….

కూతురిని హీరోయిన్ చేయాలని తల్లి పైశాచికత్వం….

కూతురిని హీరోయిన్ చేయాలనుకున్న ఓ తల్లి అడ్డదారులు తొక్కింది. బిడ్డ త్వరగా పెద్దవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమెకు రకరకాల ఇంజక్షన్లు ఇప్పించింది. అవి వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. తల్లి వేధింపులు తాళలేని బాలిక చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఏపీలోని విజయనగరంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఓ కుమార్తె పుట్టాక ఆమె మొదటి భర్త చనిపోయాడు. దీంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక అతను ఆమెను వదిలిపెట్టి.. చిన్నారులను తీసుకుని వెళ్లిపోయాడు.

ప్రస్తుతం ఆమె ఇంకో వ్యక్తితో కలిసి ఉంటోంది. మొదటి భర్తకు పుట్టిన బాలిక (15) విశాఖలోని ప్రభుత్వ విద్యా సంస్థలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో తల్లి వద్దకు తరచూ ఎవరెవరో వస్తుండటాన్ని గమనించి అక్కడ ఉండేందుకు ఇష్టపడలేదు. ఈ విషయంలో తల్లితో గొడవపడేది. ఇటీవల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ బాలికను చూశాడు. హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయని, అయితే కొన్ని అవయవాలు బొద్దుగా పెరగాలంటూ నమ్మబలికాడు. అతడి సూచనల మేరకు కుమార్తెకు రోజూ ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడింది. బాధ భరించలేక.. తల్లిని వేడుకున్నా విడిచిపెట్టలేదు. దీంతో ఏం చేయాలో తోచక చివరకు గురువారం రాత్రి 1098కు ఫోన్‌ చేసి చైల్డ్‌లైన్‌ సిబ్బందికి తన దీనస్థితిని వివరించింది. వారు వెంటనే అప్రమత్తమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసుల సహకారంతో వెళ్లి బాలికను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నంలో స్వధార్‌ హోమ్‌కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను కోరినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు.