ఒడిశాలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 280 మంది మృతి చెందినట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే.. ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ.. ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు ఒడిశా వెళ్లాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. మొదటగా మ.2.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. కాగా మోదీ ఇప్పటికే ప్రమాదంపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.