ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల విభాగంలో రెజోనా మలిక్ హీనా, పురుషుల డిస్కస్ త్రోలో భరత్‌ప్రీత్ సింగ్ బంగారు పతకాలు సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో అంతిమా పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 16 ఏళ్ల రెజోనా 53.31 సెకన్లలో లక్ష్యానికి చేరింది. భరత్‌ప్రీత్ డిస్‌్కను 55.66 మీటర్ల దూరం విసిరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇక అంతిమ పాల్ 17 నిమిషాల 17.11 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.
పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భారత ఆటగాడు దేవ్ కుమార్ మీనాకు నిరాశ ఎదురైంది. ఎయిరిండియా నిర్వాకంతో అరువుతెచ్చిన ‘పోల్’ (పొడవాటి కర్ర)తో పోటీపడాల్సి రావడంతో అతను మూడు ప్రయత్నాల్లోనూ 4.50 మీటర్ల ఎత్తును అందుకోలేకపోయాడు. 18 ఏళ్ల దేవ్ రోజూ ప్రాక్టీసు చేసుకునే పోల్‌ను ఎయిరిండియా సిబ్బంది సాంకేతిక కారణాలతో అనుమతించలేదు. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్వాహకులకు సమాచారమిచ్చి పోల్‌ను సమకూర్చాల్సిందిగా కోరింది.